ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. పోటీపడుతోన్న తెలుగు రాష్ట్రాలు!
అభివృద్ధిలోనే కాదు.. క్రిమినల్ కేసులు కలిగి ఉన్న ప్రజాప్రతినిధుల జాబితాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.;
అభివృద్ధిలోనే కాదు.. క్రిమినల్ కేసులు కలిగి ఉన్న ప్రజాప్రతినిధుల జాబితాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు చెందిన 4,092 మంది ఎమ్మెల్యేలను విశ్లేషించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంచలన విషయాలు వెల్లడించింది.
అవును... దేశంలోని 4,902 మంది ఎమ్మెల్యేలను విశ్లేషించినప్పుడు అందులో 1,861 మంది ఎమ్మెల్యేలు (సుమారు 45శాతం మంది)పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తేలింది. వారిలో 1,205 మంది అంటే.. సుమారు 29శాతం మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారని తెలిపింది.
ఈ జాబితాలో క్రిమినల్ కేసులు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గమనార్హం. ఎపీలో అత్యధికంగా 79శాతం మంది.. అంటే 138 మంది క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలతో ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తర్వాత స్థానాల్లో 69శాతం క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలతో కేరళ, తెలంగాణ ఉన్నాయి.
అయితే... 66 శాతం మంది క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలతో బీహార్ రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ తర్వాత స్థానంలో ఉండటం గమనార్హం! ఆ తర్వాత 65%తో మహారాష్ట్ర, 59శాతంతో తమిళనాడు రాష్ట్రాలు టాప్ 5 లో ఉన్నాయి. ఇదే సమయంలో తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కోంటున్న ఎమ్మెల్యేల జాబితాలోనూ 56% తో ఏపీ అగ్రస్థానంలో ఉండగా... తర్వాత వరుసగా తెలంగాణ (50%), బీహార్ (49%)తో ఉన్నాయి.
ఇక పార్టీల వారీ విశ్లేషణ విషయానికొస్తే... ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశంపార్టీలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 134 మందిలో 115 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు (86%) ఉన్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో వారిలో 82 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 1,653 మంది ఎమ్మెల్యేలలోను 638 మంది (సుమారు 39%) మందిపై క్రిమినల్ కేసులు.. 436 మంది (26శాతం) పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని విశ్లేషణలో తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే... ఆ పార్టీకి ఉన్న 646 మంది ఎమ్మెల్యేల్లో 339 మందిపై క్రిమినల్ కేసులు.. 194 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి!
ఇదే సమయంలో... తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ఎమ్మెల్యేలు 132 మందిలో 98 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. వీరిలో 42 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేలు 230 మందిలో 95 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా.. వారిలో 78 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇక.. ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ పార్టీలోని 123 మంది ఎమ్మెల్యేలలో 69 మంది క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. వీరిలో 35 మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ఇదే సమయంలో.. ఈ తాజా నివేదిక ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితిని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా.. దేశంలో 119 మంది ఎమ్మెల్యేలు బిలియనీర్లు కాగా.. అన్ని రాష్ట్రాల్లోనూ సగటున ఎమ్మెల్యేల ఆస్తులు రూ.17.92 కోట్లు. అయితే... నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సగటు ఆస్తులు మాత్రం రూ.20.94 కోట్లుగా ఉన్నాయి.