పోల‌వ‌రం అవినీతిపై పాల్వాయి లేఖ‌..క‌ల‌క‌లం

Update: 2017-06-15 09:31 GMT
ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ద‌న్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీవీసీ - సీబీఐలకు రాసిన లేఖ క‌ల‌క‌లం సృష్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవినీతి - అక్రమాలపై దర్యాప్తు జరపాలని పాల్వాయి ఉన్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కోరారు. ఇటీవల పాల్వాయి గుండెపోటుతో మరణించిన సంగ‌తి తెలిసిందే. అతయితే మరణించడానికి కొద్దిరోజుల ముందు పోల‌వ‌రం అవినీతి విష‌యంలో ఆయన రాసిన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. పాల్వాయి లేఖపై స్పందించిన కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ లేఖలోని అంశాలపై దర్యాప్తునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ లేఖను తానే రాసినట్టు ధ్రువీకరిస్తూ మరణానికి ఒక రోజు ముందు పాల్వాయి సీవీసీకి మరో లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగిసిన విషయాన్ని రాజ్యసభలో పలుమార్లు పాల్వాయి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు - ముంపు - ఆదివాసీల సమస్యలపై కూడా ఆయన పలు మార్లు రాతపూర్వక ప్రశ్నలు సంధించారు. ఈ నేపధ్యం లో ఆయన దర్యాప్తు సంస్థలకు చేసిన ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకున్నది. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అథారిటీ ద్వారా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నా యని గోవర్థనరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. కేంద్ర జలసంఘం - పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖల అనుమతులు లేకుండా చేపట్టిన పట్టిసీమ - పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు అక్రమ ప్రాజెక్టులని పాల్వాయి ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్‌ కు అదనంగా రూ. 400 కోట్లు చెల్లించారని, ఇది అక్రమమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసిందని దర్యాప్తు సంస్థలకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను అప్పగించడంతో పారదర్శకంగా వ్యవహరించలేదని, కొన్ని పనులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ పద్దతిలో కేటాయించారని తన లేఖలో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ. 10.000 కోట్ల నుంచి రూ. 41,000 కోట్లకు పెంచడం కూడా అక్రమమేనని త‌న లేఖ‌లో పాల్వాయి ఆరోపించారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని లేఖలో వివరించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో కూడా వివక్ష చూపించారని, పోలవరం కుడి కాల్వ కింద ఒక విధంగానూ, పురుషోత్త మపట్నం ఎత్తిపోతల పథకం కింద మరో విధంగానూ నష్ట పరిహారం చెల్లించారని తెలిపారు. ప్రాజెక్టు పనుల కోసం వినియోగించాల్సిన సిమెంట్‌ ను కొందరు వ్యక్తులు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు అనుకూ లంగా ప్రాజెక్టు పనుల్లోని కొన్ని అంశాల్లో మార్పులు చేశారని తెలిపారు. అక్రమాలకు ఆధారంగా కొన్ని పత్రాలను, కాగ్‌ నివేదికను, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ లను జత చేశారు. అక్రమాలపై దర్యాప్తు చేయడంతో పాటు అక్రమార్కులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ లేఖ‌పై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్ స్పందించి దర్యాప్తునకు సంసిద్ధత వ్యక్తం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News