'స్ర‌వంతి' పాపం ఎవ‌రు మోయాలి? ఎవ‌రు మోస్తారు?

Update: 2022-11-07 02:30 GMT
తెలంగాణ‌లోని కీల‌క‌మైన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌పై ఎన్నో ఆశ‌ల‌తో దిగిన కాంగ్రెస్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఇది ఊహించిందైతే కాదు.  పైగా స‌వాలుగా తీసుకున్న నియోజ‌క‌వ‌ర్గం కూడా. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాక వ‌చ్చిన కీల‌క‌మైన ఉప ఎన్నిక‌. అందునా సిట్టింగు స్థానం. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ నుంచి జంప్ అయిపోవ‌డం.. బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం ద‌రిమిలా వ‌చ్చిన ఉప ఎన్నిక కావ‌డంతో కాంగ్రెస్ దీనిన ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా.. అంద‌రిక‌న్నా ముందే అభ్య‌ర్థిని నిల‌బెట్టింది.

క‌మిటీలు వేసింది. మండ‌ల స్థాయి క‌మిటీలు, గ్రామ స్తాయి క‌మిటీలు వేసిన కాంగ్రెస్.. స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కి కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ఆధిప‌త్య పోరులో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని కాంగ్రెస్ పార్టీ కూక‌టి వేళ్ల‌తో పెక‌లించిన‌ట్టు అయిపోయింది. క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట్లు కూడా ఇక్క‌డ కాంగ్రెస్ తెచ్చుకోలేక పోయింది. చేతులు కాలిపోయిన త‌ర్వాత‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగా.. `అంత‌ర్మ‌థ‌నం చేసుకుంటాం. త‌ప్పులు స‌రిచేసుకుంటాం. ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకుంటాం`` అనే డైలాగులే నేత‌ల నుంచి వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పాల్వాయి స్ర‌వంతి ఎంపిక నాటి నుంచి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. కీల‌క నాయ‌కు ల‌ను రంగంలోకి దింప‌డంలోనూ అధిష్టానం విఫ‌ల‌మైంది. పైగా.. భార‌త్ జోడో యాత్ర పేరుతో ఎన్నిక‌ల ముందు తెలంగాణ గ‌డ్డ‌పై అడుగు పెట్టిన కీల‌క నాయ‌కుడు రాహుల్ గాంధీ.. మునుగోడు ప్ర‌జ‌ల‌కు ఏదైనా దిశానిర్దేశం చేస్తార‌ని, వారికి ఒక పిలుపు ఇస్తార‌ని స్ర‌వంతి ఆశించారు. కానీ, ఆయ‌న ప‌న్నెత్తు మాట కూడా మునుగోడు గురించి చెప్పిన పాపాన పోలేదు. అస‌లు ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రుగుతున్న‌ట్టుగా కూడా తెలియ‌న‌ట్టే వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ గురించిన చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా సాగ‌లేదు.

ఇక‌, స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉన్న వెంక‌ట‌రెడ్డి సృష్టించిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఉప ఎన్నిక‌ స‌మ‌యంలో ష‌బ్బీర్ అలీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. త‌న సోద‌రుడు రాజ‌గోపాల్‌రెడ్డికి ఓట్లేయాల‌ని ఆయ‌న ఫోన్లు చేసి పిలుపునిచ్చారు. తాను కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అదే చేశారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ ఉప్పు-ప‌ప్పు తిన్న రేణుకా చౌద‌రి వంటి ఫైర్ బ్రాండ్లు క‌నీసం క‌న్నెత్తి చూడ‌లేదు. పోనీ.. ఉన్న‌వారైనా స‌రిగా ప్ర‌య‌త్నం చేశారా?  అంటే.. కేవ‌లం మొక్కుబ‌డి తంతుగా.. ప్ర‌చారం నిర్వహించారు. వెర‌సి.. ఇప్పుడు డిపాజిట్లు కూడా ద‌క్క‌ని పాపాన్ని ఎవ‌రు మోస్తారో.. ఎవ‌రు మోయాలో.. చూడాలి!!
Tags:    

Similar News