జీఎస్టీలో మార్పుల కోసం స‌రికొత్త సిఫార్సులు

Update: 2017-10-30 07:16 GMT
దేశ మొత్త‌మ్మీదా ఒకే ప‌న్ను.. ఒకే వ‌స్తువ అంటూ తీసుకొచ్చిన జీఎస్టీ మోడీ స‌ర్కారుకు ఎన్ని మొట్టికాయ‌లు వేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జీఎస్టీకి ముందు మోడీకి ఉన్న ఇమేజ్ కి.. జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఇమేజ్‌కు వ‌చ్చిన మార్పు అంద‌రికి తెలిసిందే.

ఊహించిన దాని కంటే ఎక్కువ డ్యామేజ్ మోడీ స‌ర్కారు జ‌రుగుతుండ‌టంతో న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్ని మొద‌లెట్టింది మోడీ స‌ర్కారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు భేటీ అయిన మంత్రుల బృందం.. తాజాగా మ‌రోసారి స‌మావేశ‌మైంది.

అసోం ఆర్థిక‌మంత్రి హిమాంత బిశ్వ‌శ‌ర్మ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో బిహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ మోడీ.. జ‌మ్ముక‌శ్మీర్ ఆర్థిక మంత్రి హ‌సీబ్ డ్రాబు.. పంజాబ్ ఆర్థిక‌మంత్రి మ‌న్‌ ప్రీత్ సింగ్ బాద‌ల్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ వాణిజ్య ప‌న్నుల శాఖామంత్రి అమ‌ర్ అగ‌ర్వాల్ స‌భ్యులుగా ఉన్నారు.

ఈ మీటింగ్ లో చిన్న వ్యాపారుల‌కు మేలు క‌లిగేలా జీఎస్టీలో ప‌లు మార్పులు చేయాల‌ని మంత్రుల బృందం సిఫార్సులు చేసింది. జీఎస్టీలో కీల‌క‌మైన కాంపోజిట్ స్కీంను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా త‌యారు చేయ‌టంతో పాటు.. రెస్టారెంట్లు.. త‌యారీదార్ల‌పై ప‌న్నుల్ని త‌గ్గిస్తూ సిఫార్సులు చేశారు. కాంపోజిట్ స్కీంలో త‌యారీదార్లు.. రెస్టారెంట్ల‌పై ఇప్పుడున్న ప‌న్నురేట్ల‌ను త‌గ్గించి వాటిని కూడా ఒక‌శాతం ప‌న్ను ప‌రిధిలోకి తీసుకురావాల‌న్న కీల‌క సూచ‌న చేసింది.

అంతేకాదు.. కాంపోజిట్ స్కీం ప‌థ‌కం కింద‌కు రాని ఏసీ.. నాన్ ఏసీ రెస్టారెంట్ల మ‌ధ్య తేడా తీసేసి కామ‌న్ గా ఉండేలా ప‌న్నురేటును ఫిక్స్ చేసింది.

కాంపోజిట్ స్కీంలో ఏమేం మార్పులు చేయాల‌న్న సిఫార్సులు చేశారంటే..

+ ప్ర‌స్తుతం రెస్టారెంట్లు 5 శాతం.. త‌యారీదార్లు 2 శాతం.. వ్యాపారులు 1 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇక‌పై వీరంతా కేవ‌లం ఒక్క‌శాతం ప‌న్నుచెల్లిస్తే చాలు

+ వార్షిక ట‌ర్నోవ‌ర్ కోటిరూపాయిల‌కు మించ‌ని త‌యారీదార్లు.. వ్యాపారులు.. రెస్టారెంట్లకు కాంపోజిట్ స్కీం వ‌ర్తించేలా చేయాలి.

+ గ‌తంలో కాంపోజిట్ స్కీం కింద ప‌రిమితి రూ.75 ల‌క్ష‌లు ఉంటే.. అక్టోబ‌రు 1 నుంచి దాన్ని రూ.కోటికి పెంచారు. దీని కింద ఒక్క‌శాతం చెల్లిస్తే స‌రి.

ఇదిలా ఉంటే.. వ్యాపారుల కోసం కాంపోజిట్ స్కీంలో రెండు విధానాల్ని సిఫార్సులు చేసింది. ఇందులో మొద‌టిది.. ప‌న్ను మిన‌హాయింపు ఉన్న వ‌స్తువుల అమ్మ‌కాల విలువ‌ను మొత్తం ట‌ర్నోవ‌ర్ లో క‌ల‌ప‌కూడ‌ద‌ని కోరుకునే వ్యాపారులు ఒక‌శాతం ప‌న్నుచెల్లించాలి. రెండో అంశం విష‌యానికి వ‌స్తే.. అన్ని వ‌స్తువ‌ల ట‌ర్నోవ‌ర్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కోరితే కేవ‌లం అర‌శాతం ప‌న్ను చెల్లిస్తే స‌రిపోతుంది.

కాంపోజిట్ స్కీంలో వ్యాపారుల‌కు మ‌రికొన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాలంటూ సిఫార్సులు చేశారు వాటిల్లో ముఖ్య‌మైన‌వి చూస్తే..

= అంత‌ర్రాష్ట్ర వ్యాపారం చేసే వారు ఏ ప‌థ‌కాన్నైనా ఎంచుకోవ‌చ్చు.

= ఈ ప‌థ‌కాన్ని ఎంపిక చేసుకున్న వ్యాపారి మూడు నెల‌ల‌కోసారి ప‌న్ను చెల్లిస్తే స‌రిపోతుంది

= ఒక్క రిట‌ర్న్ స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది.ఇత‌ర వ్యాపారులైతే ప్ర‌తి నెలా ప‌న్నులు చెల్లించాలి.

= ప‌న్ను చెల్లింపుదార్లు సంపూర్ణ‌మైన వివ‌రాల్ని అన్ని అప్లికేష‌న్లో పేర్కొనాల్సిన అవ‌స‌రం లేదు.

= జాబ్ వ‌ర్క్ ల‌పై ఆధార‌ప‌డ్డ త‌యారీదారులు కాంపోజిట్ స్కీంను ఎంపిక చేసుకునే వీలు

మిగిలిన వ్యాపారాల‌కు రెస్టారెంట్ల‌కు మ‌ధ్యన పెద్ద వ్య‌త్యాస‌మే ఉంది. జీఎస్టీ వ్య‌వ‌హారంలో రెస్టారెంట్ల‌మీద అమ‌లుచేస్తున్న ప‌న్ను తీరుపై అటు వ్యాపారుల‌కు ఇటు వినియోగ‌దారుల‌కు తీవ్ర‌మైన అసంతృప్తిలో ఉన్నారు. రెస్టారెంట్ల‌లో అమ‌లు చేస్తున్న జీఎస్టీ తీరు గంద‌ర‌గోళానికి గురి తీసేలా ఉంది. దీనికి చెక్ చెప్పేలా తాజాగా కొన్ని సిఫార్సులు చేశారు. దీని ప్రకారం.. జీఎస్టీ విధింపులో రెస్టారెంట్ల మ‌ధ్య తేడాలు చూపించాల్సిన అవ‌స‌రం  లేద‌ని తేల్చారు. ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏసీ రెస్టారెంట్ల‌పై 18 శాతం.. నాన్ ఏసీ రెస్టారెంట్ల‌పై 12 శాతం ప‌న్ను ఉండ‌గా.. ఇక‌పై అలాంటి తేడాలేమీ లేకుండా రెండింటికి 12 శాతం మాత్ర‌మే వ‌సూలు చేయాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఇక‌.. హోట‌ల్స్ లో రోజువారీ అద్దె రూ.7500 దాటిన హోట‌ళ్ల‌కు మాత్ర‌మే 18శాతం ప‌న్ను ఉండాల‌ని సిఫార్సు చేశారు. మ‌రి..కొత్త సిఫార్సుల్లో ఎన్నింటిని అమ‌ల్లోకి కేంద్రం తీసుకొస్తుందో చూడాలి.
Tags:    

Similar News