విధేయుడి రాజీనామాకు ఓకే చేశారు

Update: 2017-02-06 08:42 GMT
విధేయతకు నిలువెత్తు రూపంగా.. తానెప్పుడూ ఒకేలా ఉంటానన్న విషయాన్ని తేల్చి చెప్పటమే కాదు.. ఇప్పటి రోజుల్లోనూ తనను తాను మార్చుకోని అరుదైన నేతగా నిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోకున్నా.. అపత్ కాలంలో ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. విధేయతతో పని చేసే పన్నీరు సెల్వం తాజాగా మరోసారి తన పాత్రను తనకు తగ్గట్లే పూర్తి చేశారు.

చిన్నమ్మ ఆదేశాల మేరకు.. ఆమె సీఎం కుర్చీలో కూర్చోవటానికి వీలుగా తన పదవికి రాజీనామా చేసిన పన్నీరు.. లేఖను గవర్నర్ కు పంపారు. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన చిన్నమ్మ శశికళ తమిళనాడు సీఎం అయ్యేందుకు అవసరమైన గ్రౌండ్ సిద్ధం చేసేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పన్నీరు రాజీనామా లేఖను తాజాగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పన్నీరు సెల్వం పంపిన రాజీనామా లేఖపై తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేశారు. దీంతో.. సీఎం పన్నీరు కాస్తా మాజీ సీఎంగా మారిపోయారు. మరోవైపు.. సీఎం కుర్చీలో కూర్చునేందుకు తహతహ లాడుతున్న చిన్నమ్మ ప్రయత్నాలకు ఇబ్బంది కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. పన్నీరు తన పదవికి రాజీనామా చేసినంత సులువుగా.. శశికళ సీఎం కుర్చీలో కూర్చుంటారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News