పార్ల‌మెంటుకు నిప్పు పెట్టేశారు

Update: 2017-04-01 10:44 GMT
నిబంధ‌న‌ల‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం దేశ ప్ర‌యోజ‌నాల‌కు భంగక‌ర‌మ‌ని పేర్కొంటూ చేప‌ట్టిన ఆందోళ‌న ప‌రాగ్వేలో తీవ్ర రూపం దాల్చింది. ఏకంగా పార్ల‌మెంట్‌కు ఆందోళ‌న‌కారులు నిప్పుపెట్టారు. నిర‌స‌న‌కారుల ధాటికి  ప‌రాగ్వే కాంగ్రెస్ బిల్డింగ్‌ ను  బూడిదైంది. ప‌రాగ్వే రాజ్యాంగం ప్ర‌కారం దేశాధ్య‌క్షుడు ఎవ‌రైనా అయిదేళ్లు మాత్రమే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చేప‌ట్టిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా దేశాధ్య‌క్షులు మ‌రోసారి ప‌ద‌వి చేప‌ట్టేందుకు వీలు ఉంటుంది.  ప్రెసిడెంట్ రెండ‌వ సారి ఎన్నికల్లో పాల్గొనే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ చేసిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమైంది. సెనేట‌ర్లు ఆ బిల్లుకు ఆమోదం క‌ల్పించ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాలు మండిప‌డ్డాయి. బిల్లుకు ఆమోదం ద‌క్క‌గానే నిర‌స‌న‌కారులు రోడ్ల‌పై విరుచుకుపడ్డారు. అదే ఊపులో ఉభ‌య‌స‌భ‌ల బిల్డింగ్‌పై దాడికి దిగారు. కాంగ్రెస్ బిల్డింగ్‌ కు నిప్పుపెట్టారు. నిరసనకారుల దాడిలో సేనేటర్లు - జర్నలిస్టులు గాయపడ్డట్లు తెలుస్తున్నది.

సెనేట‌ర్లు ర‌హ‌స్యంగా నిర్వ‌హించిన ఓటింగ్ ద్వారా దేశాధ్య‌క్షుడు హోరేసియో కార్ట్స్ మ‌రోసారి ప‌ద‌విని ద‌క్కించుకునే అవ‌కాశాలున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని అసెన్సియ‌న్ వీధుల్లో ఆందోళ‌న‌కారులు పెను విధ్వంసం సృష్టించారు. కాంగ్రెస్ బిల్డింగ్ ఎంట్రెన్స్ గేటును, ఆ బిల్డింగ్ అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప‌లికిన సెనేట‌ర్ల ఆఫీసుల‌ను నిర‌స‌న‌కారులు టార్గెట్ చేశారు. ఈ ఆందోళ‌న‌లో సుమారు 30 మంది గాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. సేనేట‌ర్లు నిర్వ‌హించిన ఓటింగ్ అక్ర‌మ‌మ‌ని, అది నిరంకుశ పాల‌న‌గా మారుతుంద‌ని ప్ర‌తిపక్షాలు ఆరోపించాయి. అధికారాన్ని ద‌క్కించుకునేందుకు ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నిద‌ని ప్ర‌తిప‌క్ష సెనేట‌ర్ ఒక‌రు ఆరోపించారు. కాగా, ప్ర‌స్తుతం సేనేట్‌లో ఆమోదం పొందిన బిల్లు ఆ త‌ర్వాత దిగువ స‌భ‌కు వెళ్తుంది. అయితే అక్క‌డ ప్రెసిడెంట్ కార్ట్స్‌కు మెజారిటీ ఉంద‌ని, ఒక‌వేళ ఆ బిల్లుకు ఆమోదం ద‌క్కితే అన్యాయం అవుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News