కేటీఆర్ ‘కాపీ’ ఆరోపణలపై పరకాల ఫైరింగ్

Update: 2016-07-06 09:14 GMT
తమ వెబ్ సైట్లోని సమాచారాన్ని కాపీ కొట్టారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడటం.. ఆ అంశాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లటం తెలిసిందే. అదే సమయంలో సైబర్ చట్టం కింద ఏపీ సర్కారుపై కేసు నమోదు చేయటం కలకలాన్ని రేపింది. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్ లైన్ అప్లికేషన్ల’’ను కాపీ కొట్టారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఫైర్ అయ్యారు.

ఎలాంటి ఆధారాలు లేని చవకబారు ఆరోపణలపై తాము దృష్టి సారించబోమంటూ ఆయన తేల్చి చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తెలంగాణ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని.. కావాలనే తమపై బురద జల్లుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ పోర్టల్ ద్వారా దాదాపు 9వేల లావాదేవీలు జరిగాయని.. తెలంగాణ మంత్రి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తాము తేల్చినట్లుగా ఆయన చెప్పారు.

ఇప్పటివరకూ ఏ రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదు చేసింది లేదని.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర వైఖరి ఉందన్నారు. కనీస సమాచారం లేకుండా మాట్లాడటంపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ లో ఎవరిది తప్పు.. ఎవరిది రైటు అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఆసక్తికర కోణం ఉందని చెప్పాలి. తమ సైట్ ను కాపీ కొడుతున్నారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను ఆశ్రయిస్తే.. ఆయన చేసిన కంప్లైంట్ కు కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రమంత్రి భర్త పరకాల ప్రభాకర్ ఏపీ సర్కారు తరఫున మండిపడటం గమనార్హం.
Tags:    

Similar News