ఆయ‌న‌తో భేటీ..ప‌రిపూర్ణ‌కు బెర్త్ ఖ‌రారైన‌ట్లే

Update: 2018-10-08 16:44 GMT
తెలంగాణ బీజేపీలో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వచ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో హిందుత్వ గ‌ళాన్ని వినిపిస్తున్న స్వామి పరిపూర్ణానంద కేంద్రంగా ఈ ఆస‌క్తిక‌ర‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం - అనంత‌రం ఆయ‌న న‌గర బహిష్కరణ అవ‌డం తెలిసిన సంగతే. తర్వాత 55 రోజుల అనంతరం స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌ లో అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త్వరలోనే తాను తెలంగాణలోని ప్రతి గల్లీ గల్లీ తిరుగుతాను అని ప్రకటించిన స్వామీజీ.. ఎవడు ఆపుతాడో చూస్తానని అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆయ‌న తాజాగా ఢిల్లీలో క‌నిపించారు. శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిశారు. ఢిల్లీలోని అమిత్‌ షా నివాసంలో ఏకాంతంగా భేటీ అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. ఈ భేటీ ద్వారా ఆయ‌న‌కు ఓ సీటు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది.

బ‌హిష్క‌ర‌ణ అనంత‌రం హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన ప‌రిపూర్ణానంద ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా...బాసర నుంచి భద్రాచలం దాకా కాషాయం రెపరెపలాడేలా కార్యక్రమాలు చేపడుతానని - అంతేకాదు తెలంగాణలో ప్రతి వ్యక్తి నోటి నుంచి భారత్ మాతాకీ జై అనే రోజు వస్తుందన్నారు. భారతదేశాన్ని హిందుస్తాన్ అంటారని.. కానీ ఇక్కడ హిందువులకే స్థానం లేని దుస్థితిని మన నాయకులు తీసుకొచ్చారని ప‌రిపూర్ణానంద‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువు మాట్లాడితే బహిష్కరిస్తున్నారని వాపోయారు. కమ్యూనిస్టుల పాలనలో కూడా ఇలాంటి దారుణాలు జరగవన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కాషాయాన్ని ఒంటి మీద వేసుకుని గల్లీ గల్లీ తిరిగితే ఒక్క ఓల్డ్ సిటీ ఏంటి తెలంగాణ మొత్తాన్ని గోల్డ్ సిటీగా మార్చుకోవచ్చని ప‌రిపూర్ణానంద‌ అన్నారు. ఇలా స్వామి ప‌రిపూర్ణానంద ఇలాంటి హాట్ హాట్ కామెంట్లు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో కొత్త వాద‌న‌ను తెర‌మీద‌కు తెచ్చారు. త్వ‌ర‌లో ఆయ‌న బీజేపీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఇలా ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు కొన‌సాగిన త‌రుణంలోనే తాజాగా ఢిల్లీలోని అమిత్‌ షా నివాసంలో ఆయ‌న‌తో ప‌రిపూర్ణానంద‌ ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట పాటు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం హాట్ టాపిక్‌గా  మారింది.  తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిసింది. అంతక ముందు ఆయన ఆర్ఎస్ఎస్‌ నేత రామ్‌మాధవ్‌తోనూ భేటీ అయ్యారు. ఆయన బీజేపీలో చేరుతున్నారని, తెలంగాణకు ఆయన మరో యోగి ఆదిత్యనాథ్ కానున్నారని అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందిందని.. అందులో భాగంగానే అమిత్‌ షాను కలిశారని తెలుస్తోంది. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News