బాబు...ఇది డ్యామేజింగ్ వార్త‌

Update: 2015-09-20 08:43 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వానికి చేదువార్త‌. రికార్డు సమయంలో ప్రతిష్టాత్మక ప‌ట్టిసీమ‌ ప్రాజెక్టు పూర్తి చేసి దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలిస్తున్న సమయంలోనే పోలవరం కుడికాలువకు గండిపడింది. తొలిరోజు సకాలంలో నీటివిడుదల సాధ్యం కాలేదు. రెండోరోజు మోటార్లు మొరాయించాయి. మూడోరోజు గండిపడి నీరు పక్కదారి పట్టింది. పట్టిసీమఎత్తిపోతల పథకంలో 12మోటార్లు పని చేస్తాయి. వీటి నుంచి 3వేలకుపైగా క్యూసెక్కుల నీరు పోలవరం కుడికాలువలోకొచ్చి చేరుతుంది.

తొలిరోజు ఒకే ఒక్క మోటార్‌ ను పని చేయించారు. దీని నుంచి 350క్యూసెక్కుల నీరు విడుదలైంది. ఈ నీరు పారుతుండగా పెదవేగి మండంల జానంపేట ఆక్విడెక్ట్‌ వద్ద ఈ కాలువకు గండిపడింది. జానపేట వద్ద తొలుత‌ కాలువ రివిట్‌ మెంట్‌ చెమ్మగించింది. అనంతరం అక్కడ ఈల శబ్దా లొచ్చి ఒక్కసారిగా నీరు లీకవడం మొదలైంది. అరగంట వ్యవధిలోనే అది గండిగా మారింది. అక్కడి నుంచి నీరు తమ్మిలేరులోకి ప్రవహించసాగింది. ఇది చిన్నపాటి గండేనంటూ అధికారులు పేర్కొంటున్న‌ప్ప‌టికీ.... 170కిలోమీటర్ల పొడవైన ఈ కాలువకు నీటిని విడుదల చేసిన 24గంటల్లోనే గండిపడ‌టం పనుల నిర్వహణలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అయితే హడావిడిగా దీన్ని పూడ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో వందలాదిమంది గండి పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ గండి కాలువల నిర్మాణ లోపభూయిష్టతపై అనేక ప్రశ్నల్ని సంధిస్తోంది.

తక్కువ సమయంలోనే నీటిని కృష్ణానదికి మళ్ళించాలన్న తాపత్రయం మినహా నీటి తరలింపులో జాగ్రత్తలు పాటించలేదన్న విషయం స్పష్టమౌతోందని స్థానికులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎత్తిపోతల నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ముందుగా భావించారు. కానీ మూడు నెలల్లో పనులు పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు తరలించి రికార్డు సృష్టించాలన్న ఆతృత పెరిగింది. ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. పనుల పర్యవేక్షణకంటూ నెలకు నాలుగైదు సార్లు పట్టిసీమకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు జాతీయస్థాయిలో ప్రచారం లభించింది. ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్ళించడం ద్వారా నదుల అనుసంధాన ప్రక్రియలో తొలి ప్రయత్నం విజయం సాధించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంధానానికి ఆద్యులం తామేనంటూ ప్రచారం చేశారు.

ఈ ఎత్తిపోతల పథకానికి అనుమతి నుంచి నీటి విడుదల వరకు అన్నింట్లోనూ గందరగోళం నెలకొంది. ఆగస్టు 15న పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. చివరకు నీటి విడుదలపై పలు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు ఈ నెల 16న ఇబ్రహీంపట్నంలో సంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భారీ కార్యక్రమాలు నిర్వహించి ఇందుకు గుర్తుగా పైలాన్‌ కూడా ఆవిష్కరించారు. ఒక్క మోటార్‌ నుంచి విడుదలైన 350 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే గట్లు బలహీనపడి గండిపడితే మరి ప్రాజెక్ట్‌ లక్ష్యం మేరకు 12మోటార్లు పని చేసి 3వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని కాలువలోకి విడుదల చేస్తే ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందోనన్న ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో ఏర్పడింది.ఇదిలాఉండ‌గా.... నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం రాత్రి పోలవరం కుడికాలువకు గండిపడిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గండిని తక్షణమే పూడ్చే పనులు చేపట్టాలని అధికారులను దేవినేని ఆదేశించారు.
Tags:    

Similar News