అప్పు ఉంద‌ని ఏపీని కూడా అమ్మేస్తారా?

Update: 2021-12-13 08:56 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారా? త‌మ‌తో పొత్తులో ఉన్న బీజేపీతో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలాగైనా ప్రైవేటు ప‌రం చేస్తామ‌ని కేంద్రం అడుగులు వేస్తుంటే.. ప‌వ‌న్ మాత్రం అందుకు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును నేరుగా ప్ర‌శ్నించ‌కుండా.. అస‌లు ఆ పేరు ఎత్త‌కుండా జాగ్ర‌త్త‌గా త‌న గ‌ళాన్ని వినిపిస్తున్నారు. అటు పొత్తు చెడ‌గొట్టుకోకూడ‌ద‌ను అనుకుంటూనే.. ఇటు ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు చెప్తున్నారు.

ఇప్ప‌టికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా విశాఖ వెళ్లి అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించారు. అప్పుడు ఈ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అఖిల ప‌క్షం ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆయ‌న డెడ్‌లైన్ విధించారు. కానీ అది ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ దానిపై మాట్ల‌డ‌లేదు.

ఇక ఇప్పుడు తాజాగా ఆదివారం మంగ‌ళ‌గిరిలోని త‌న పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో దీక్ష చేశారు. ఈ దీక్ష‌లోనూ వైసీపీ ప్ర‌భుత్వంపైనే ఆయ‌న మండిప‌డ్డారు. ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానిక‌ర‌మ‌ని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటారో లేదో చెప్పాల‌ని, పార్ల‌మెంట్లో వైసీపీ ఎంపీలు క‌నీసం ఫ్ల‌కార్డులు కూడా ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌ని.. ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో పరోక్షంగా కేంద్రంపై కూడా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఎందుకంటే అప్పుల్లో ఉంద‌ని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌ని అనుకుంది కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు. ఎన్ని ర‌కాలుగా వ్య‌తిరేక‌త వ‌చ్చినా ఈ విష‌యంలో త‌గ్గేది లేద‌న్న‌ట్లు మోడీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో దీక్ష చేసిన ప‌వ‌న్‌.. అప్పులున్నాయ‌ని విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రిస్తామ‌ని అంటున్నారు. మ‌రి రూ.6 ల‌క్ష‌ల కోట్ల అప్పు ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నూ ప్రైవేటీక‌రిస్తారా? అని ప్ర‌శ్నించారు.

ఇది ఆయ‌న కేంద్రాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే నేరుగా కేంద్ర వైఖ‌రిని ప్ర‌శ్నించ‌కుండా.. ఇలా అని అన‌న‌ట్లుగా మాట్లాడ‌టం ఎందుకు అని ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే అప్పు అంశాన్ని లేవ‌నెత్తి జ‌గ‌న్‌ను కూడా ఇర‌కాటంలో పెట్టాల‌నేది ప‌వ‌న్ వ్యూహంగా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. కానీ ఏది ఏమైనా ఆయ‌న విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చి మాట్లాడితే మేల‌ని నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News