దీక్ష పేరుతో పవన్ డ్రామా ?

Update: 2021-12-11 05:39 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష డ్రామా చేయబోతున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పవన్ దీక్ష చేయబోతున్నారు. పవన్ చేయబోతున్న దీక్షను డ్రామా అని ఎందుకనాల్సొచ్చింది ? ఎందుకంటే పవన్ చేయబోతున్న దీక్ష స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైనందుకట. ఏదో కామెడీ సినిమాలో చెప్పినట్లు స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానిది.ఇపుడు ప్రైవేటీకరణ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి పవన్ కల్యాణ్ మిత్రపక్షం.

అంటే పవన్ చేయబోయే దీక్ష కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పటమంటే డ్రామా కాక మరేమిటి ? ఇదే విషయమై కార్మికులు, ఉద్యోగ సంఘాలు దాదాపు ఎనిమిది మాసాలుగా స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర దీక్షలు చేస్తున్నారు.

నిజంగానే పవన్ దీక్షలో చిత్తశుద్ధి ఉంటే తాను కూడా వైజాగ్ వెళ్ళి అక్కడే దీక్ష చేస్తే కార్మికులు, ఉద్యోగుల దీక్షకు ఊపొచ్చేది. అలా కాకుండా అమరావతిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేయటం ఏమిటో అర్థం కావడం లేదు.

విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రం ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశారు. ప్రైవేటీకరణ తప్పదని అనుకుంటే సంస్థను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయమని కూడా ప్రతిపాదించారు.

అయితే జగన్ లేఖను కేంద్రం పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. వాస్తవానికి స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రానిది. కాబట్టి అమ్మకం, లీజు విషయంలో సర్వహక్కులు కేంద్రానికి మాత్రమే ఉంది.

తన సంస్థను తాను అమ్మేసుకోవాలని కేంద్రం నిర్ణయిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ గా చంద్రబాబు నాయుడు, పవన్ అండ్ కో మొదటి నుండి ఆరోపించటమే విచిత్రం. మిత్రపక్షమైన బీజేపీ నేతలను నిలదీసేంత ధైర్యం పవన్లో కనిపించటంలేదు.

ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడిని కలిసి అభ్యంతరం చెప్పేంత సీన్ పవన్ కు లేదు. అలాంటపుడు బీజేపీతో తెగతెంపులు చేసుకుని కార్మికులు, ఉద్యోగులకు మద్దతుగా పవన్ కూడా రోడ్డెక్కాలి. అంతేకానీ ప్రధానితో మాట్లాడకుండా బీజేపీని నిలదీయకుండా రాష్ట్రప్రభుత్వాన్ని మాత్రమే తప్పుపట్టడం డ్రామాకాక మరేమవుతుంది.


Tags:    

Similar News