కన్నడ ఫార్ములా...పవన్ కి సరిపోయేలా ఉందే...?

Update: 2023-05-19 06:00 GMT
కన్నడ నాట కాంగ్రెస్ అధికారంలో షేరింగ్ ని జాగ్రత్తగా   పంచింది. ఇద్దరు కీలక నాయకులకు చెరి సమానంగా ప్రాధాన్యత ఇచ్చింది. ఒక విధంగా ఈ ఫార్ములా మంచి అడ్జస్ట్ మెంట్ గానే చూస్తున్నారు. ఏపీలో కూడా పొత్తులు పెట్టుకోబోయే పార్టీలు, రేపటి రోజున అధికారం లో  వాటా కావాలనుకునేవారు ఈ ఫార్ములాని ఒకటికి రెండు సార్లు అధ్యయనం చేస్తే బెటర్ అంటున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఈ పొత్తులో చంద్రబాబు సీఎం అవుతారు అన్నది వాస్తవం. ఆయన అనుభవం సీనియారిటీ వంటివాటితో పాటు పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకే సీఎం సీటు ఇవ్వడం న్యాయం అన్నది కూడా అందరి మాటగా ఉంది.

పవన్ సైతం తాను సీఎం సీటు కోరుకోవడంలేదు అంటూనే మరుసటి రోజుకల్లా మాట మార్చారు. ఎన్నికల తరువాత సీఎం పోస్టు విషయంలో చర్చిస్తామని అన్నారు. పవన్ ఆ మాట అన్నా సీఎం బాబే అవుతారు అన్నది తెలిసిన విషయమే అంటున్నారు. మరి పవన్ ఏమి చేయాలి అంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా జనసేనకు ఫుల్ జోష్ గా ఉంటుంది అని అంటున్నారు.

అయితే ఏపీలో ఒకపుడు డిప్యూటీ సీఎం కి ఎంతో వాల్యూ ఉండేది. సీఎం తరువాత అంతటి పోస్టుగా ఉండేది. కానీ దాన్ని కూడా ఇతర మంత్రుల మాదిరిగా మార్చేసి అయిదుగురు వరకూ జగన్ ఆ పదవిని పెంచి ఇచ్చారు దానికి ముందు చంద్రబాబు ఇద్దరికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. దాంతో డిప్యూటీ సీఎం అంటే ఆరవ వేలుగానే మిగిలిపోతోంది. అన్ని పదవుల మాదిరే అన్న భావన వస్తోంది.

కానీ కర్నాటకలో డిప్యూటీ సీఎం అంటే పవర్ ఫుల్ అని డీకే శివ కుమార్ నిరూపించారు. ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ముగ్గురు కాకుండా ఒక్కరే ఉండాలని, ఆ డిప్యూటీ చేతికి కీలక శాఖలు దక్కాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇదీపుడు అంతటా చర్చకు తావిస్తోంది. రేపటి రోజున ఏపీలో జనసేన టీడీపీ కూడా ఈ ఫార్ములాను అనుసరిస్తే బాబు సీఎం అయినా పవన్ డిప్యూటీ సీఎం గా ఏకైక  పదవితో రాజ్యం చేయవచ్చు అన్న సూచనలు వస్తున్నాయి.

అలా కనుక ఒప్పందం చేసుకుంటే జనసేనకు కూడా అది ఆమోదయోగ్యంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. పైగా కీలక శాఖలు అంటే హోం, ఆర్ధికం వంటివి ఉంటాయి. వాటిలో ఒక దాన్ని తీసుకుని బాబు పక్కన కూర్చుంటే దర్జాకు దర్జా, హోదాకు హోదా సరిసమానమైన ప్రాధాన్యత దక్కుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఫలితం కూడా చక్కగా దక్కుతుంది అని అంటున్నారు.

మొత్తానికి ఏపీలో ఇపుడు ఏమి చేయాలన్నా ఏ రాజకీయ పరిణామం జరగాలన్నా కర్నాటక వైపే చూస్తున్నారు. కింగ్ మేకర్ కింగ్ అన్న మాటలు అక్కడ నుంచే తెచ్చుకుని రాజకీయం చేస్తున్నారు. ఇపుడు కన్నడ కాంగ్రెస్ ఫార్ముల ఏపీలో సైతం చర్చకు తావిస్తోంది. మరి చూడాలి ఏపీలో ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందో..

Similar News