కాచుకోండి.. పోటీ ఖాయమన్న పవన్

Update: 2018-06-25 08:49 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాక వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో బలం లేదని పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఆ పార్టీల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీలు నెరవేరలేదు. దీంతో బీజేపీపై ఒంటికాలిపై లేచారు. తర్వాత చంద్రబాబు ను విభేదించారు. బాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు ఉత్తరాంధ్ర యాత్రను చేపట్టారు.

వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటన చేశారు. ఈ మేరకు పవన్ తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2014లో తెలుగు ప్రజల సుస్థిరత కోసం సహకారం అందించానని.. కానీ ఈసారి 2019 ఎన్నికల్లో మాత్రం సమతుల్యత కోసం పోటీచేస్తున్నానని స్పష్టం చేశారు.

ఇప్పటికే పవన్ జనంలో చురుగ్గా ఉండేందుకు రాజధాని అమరావతి ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్నారు. మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలో జాతీయ రహదారి వెంబడి జనసేన కార్యాలయం - తన గృహ నివాస పనులను ఆదివారం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  ఆ తర్వాత నేతల నుంచి ఈ ప్రాంతంలో భూముల ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు..   జనసేన పార్టీని గ్రామగ్రామానికి విస్తరించే పనిలో భాగంగా జిల్లా సభ్యులను ఎంపిక చేశారు. ప్రజలలో పర్యటిస్తూ వారి సమస్యలు వింటున్నారు.

*చంద్రబాబుపై ఐవైఆర్ ఆగ్రహం

ఇక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవడంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు మండిపడ్డారు. ‘‘అంగన్ వాడీ ఉద్యోగులు - ఉద్యోగులు - రాజకీయంగా ఏ ఒక్క పార్టీకి  ప్రచారం చేయడం నిషిద్ధం.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇలా ఉద్యోగులను వాడుకోవడం విరుద్ధం. ముఖ్యమంత్రి గారు వారిని ఆ విధంగా వాడుకోకుండా ఉండుంటే బాగుండేది’ అని ఐవైఆర్ కృష్ణరావు  బాబు తీరు మంచిది కాదని ట్వీట్ చేశారు.
Tags:    

Similar News