ప‌వ‌న్ నోట బాబు మాట వ‌చ్చేసింది

Update: 2018-03-19 10:36 GMT
అనుమానాలు నిజ‌మ‌వుతున్నాయి. రాజ‌కీయాల్లోనూ.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల విష‌యంలో ప‌వ‌న్ కున్న క‌మిట్ మెంట్ మీద ఇప్ప‌టివ‌ర‌కూ సందేహాలు వ్య‌క్తం చేసిన వారి అంచ‌నాలు నిజ‌మ‌య్యేలా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూ తెర మీద‌కు వ‌చ్చింది. జ‌న‌సేన ఆవిర్భావ స‌ద‌స్సులో ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడ‌ని ప‌వ‌న్.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ‌టం.. ఆయ‌న స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు గుప్పించ‌టం తెలిసిందే.

దీనిపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్న వేళ‌.. ఒక మీడియా ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హోదా మీద ప‌వ‌న్ పిల్లిమొగ్గ వేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏపీ ద‌శ మారాలంటే హోదా త‌ప్ప‌నిస‌రి అంటూ నిన్న‌టి వ‌ర‌కూ మాట్లాడిన ప‌వ‌న్‌.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారుతోంది.

జాతీయ ఛాన‌ల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీకి హోదాను డిమాండ్ చేయ‌కుండా.. నిధులు ఇస్తే స‌రిపోతుందంటూ ప‌వ‌న్ స్వ‌రంలో వ‌చ్చిన మార్పు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతోంది. బీజేపీ అధినాయ‌క‌త్వం చెప్పిన‌ట్లుగా ప‌వ‌న్ ఆడుతున్నార‌న్న అనుమానాలు బ‌ల‌ప‌డేలా ప‌వ‌న్ తాజా వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ప‌వ‌న్ ఇంట‌ర్వ్యూ మొత్తం ప్ర‌సార‌మైతే.. హోదాపై ప‌వ‌న్ ఎలాంటి క్లారిటీతో ఉన్నార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏమైనా.. ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ మ‌రింత క‌ల‌క‌లాన్ని సృష్టించ‌నున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

వాస్త‌వానికి హోదా కోస‌మే.. మోడీ స‌ర్కారుపై అవిశ్వాసాన్ని పెట్టాల‌ని.. అలా పెడితే తాను స్వ‌యంగా రంగంలోకి దిగుతాన‌న్న ప‌వ‌న్ మాట‌ల‌తో హోదా అంశంపై క‌ద‌లిక మొద‌లైంది. మొదట్నించి హోదా మీద త‌న స్వ‌రాన్ని బ‌లంగా వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ.. మోడీ స‌ర్కారుపై అవిశ్వాసాన్ని పెట్ట‌టం.. దీనికి ప్ర‌తిగా ఏపీ అధికార ప‌క్షం మోడీపై అవిశ్వాసాన్ని పెట్ట‌టం తెలిసిందే. ఇలాంటి వేళ‌.. హోదా మీద మోడీని నిల‌దీస్తాన‌న్న ప‌వ‌న్.. అందుకు భిన్నంగా ఏపీకి నిధులు చాల‌న్న మాట చెప్ప‌టం ప‌లు సందేహాలు రేకెత్తించేలా మారింది.


Tags:    

Similar News