చంద్రబాబు లేనప్పుడే పవన్ బయటకొస్తాడా?

Update: 2018-01-22 04:29 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకస్మికంగా రాజకీయ యాత్ర షెడ్యూల్ ప్రకటించడం.. షెడ్యూల్ ప్రకటించిన మరునాటి నుంచే, అంటే ఈ రోజు నుంచే యాత్ర మొదలవుతుండడం తెలిసిందే. పవన్ యాత్ర ఈ రోజు తెలంగాణలోని కొండగట్టు నుంచి మొదలవుతుంది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో ఆయన పర్యటించి అభిమానులు - కార్యకర్తలతో సమావేశం కావడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని జనసేన ఇప్పటికే ప్రకటించింది. అయితే... పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాల షెడ్యూల్‌ ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అది... ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో లేనప్పుడు పవన్ జనంలోకి వస్తున్నారు. దీంతో రాష్ర్టంలో చంద్రబాబు లేని సమయంలో మీడియా ఫోకస్ ఇతర పార్టీల వైపు మళ్లకుండా - ఆ సమయంలో వైసీపీ - జగన్‌ కు మీడియాలో మైలేజ్ రాకుండా పవన్ డైవర్ట్ చేసే పని పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  గతంలోనూ ఇలాంటి సందర్భాలున్నాయని చెబుతున్నారు.
    
ఇటీవల సీఓటర్ సర్వే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కష్టమని తేల్చింది. మరోవైపు జగన్ పాదయాత్రకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇటు తెలంగాణలో ఒక్క కార్యకర్త కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు ఆ నాలుగు రోజుల సమయంలో ఇతర పార్టీల నేతలకు ఏమాత్రం కొత్త అవకాశాలు దక్కకుండా ఉండేందుకు పవన్‌ ను వదిలారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ ఎలాగూ మిత్రుడే - టీడీపీకి ఓట్లు తేవాల్సినవారే. సో... ఇప్పుడు తెలంగాణలో ఆయన పర్యటన వల్ల అక్కడ ఓట్లు రావడం - రాకపోవడం పక్కనపెడితే మీడియా మొత్తం ఆయన పర్యటనపై ఫోకస్ చేయడం మాత్రం ఖాయం. పవన్-చంద్రబాబుల వ్యూహం ఇదేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
    
పవన్ 22 నుంచి యాత్ర చేస్తుండగా చంద్రబాబు విదేశీ పర్యటన కూడా అదే తేదీల్లో ఉంది. దీంతో ఈ ప్రచారానికి మరింత ఊతం దొరుకుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. కొందరైతే గతంలోనూ పవన్ పలు సందర్భాల్లో చంద్రబాబు రాష్ర్టంలో లేనప్పుడే ట్వీట్లు చేయడమో - జనసేన కార్యక్రమాలు చేపట్డడమో చేశారని గుర్తు చేస్తున్నారు. ఇదంతా యాదృచ్ఛికమో - ఉద్దేశపూర్వకమో కానీ ఇప్పుడైతే ఇద్దరి షెడ్యూల్ ఒకేసారి ఉండడం.. పవన్ చాలా హడావుడిగా యాత్ర ప్లాన్ చేయడం రాజకీయంగా అందరిలోనూ అనుమానాలను కలిగిస్తోంది.
Tags:    

Similar News