పవన్ ఆ పని చేసుంటే బావుండేది, ఫ్యాన్స్ ఆవేదన!

Update: 2019-07-31 01:30 GMT
'తెలుగుదేశం పార్టీ నుంచి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ముందే పొత్తు ప్రతిపాదనలు వచ్చాయి..' అని ఇప్పుడు సెలవిచ్చారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్! ఈ మాటలు విని విస్తుపోతున్నారు ఆయన అభిమానులు. అంతా అయిపోయాకా పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడుతూ ఉండటంతో వారిలో కొంత విసుగు కూడా వస్తోంది.

ఇటీవలి ఎన్నికలతో జనసేన పార్టీ పరువు ఏ రేంజ్ లో పోయిందో అందరికీ తెలిసిందే. అసలే మెగా బ్రదర్స్  రాజకీయాన్ని  జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందే ఆ పరిస్థితి ఉండింది. ప్రజారాజ్యం అనుభవంతో పవన్ కల్యాణ్ ను విశ్వసించలేదు. అది ఎన్నికలకు ముందే తేలిపోయింది. క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసిన వాళ్లు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు కూడా.

అయితే జనసైనికులు తమ పార్టీని చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. ఆఖరికి పవన్ కల్యాణ్ కూడా వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోయినట్టుగా ఉన్నారు. అందుకే తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరఫు నుంచి పొత్తు ప్రతిపాదనలు వచ్చినా తను తిరస్కరించినట్టుగా పవన్ కల్యాణ్ సెలవిచ్చారు!

ఒకవేళ అది నిజమే అయి ఉంటే.. పవన్ ఆ ప్రతిపాదనల్లో దేన్నో ఒక దానికి ఒప్పుకోవాల్సిందని ఇప్పుడు జనసేన వీరాభిమానులు కూడా అంటున్నారు. అప్పుడు డిమాండ్ చేసేందుకు కూడా అవకాశం ఉండేదని, వాళ్లే ప్రతిపాదించారు కాబట్టి ఎన్నో కొన్ని సీట్లను అడిగి తీసుకుని పోటీ చేసి ఉంటే.. ఆఖరికి పవన్ కల్యాణ్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అనే ట్యాగ్ ఉండేది కాదని జనసేన వర్గాలు వాపోతున్నాయి.

ఆ పొత్తు ప్రతిపాదనలకు నో చెప్పి పవన్ కల్యాణ్ పెద్ద పొరపాటే చేశాడని - దీంతో రెండో చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఖ్యాతి మిగలడం - రాష్ట్రమంతా జనసేన చిత్తయిపోవడం.. ఇప్పుడు పార్టీ ఉంటుందా? వెళ్లిపోతుందా? అనే పరిస్థితి కొనసాగుతోందని ఫ్యాన్స్ ఆవేదన భరితులు అవుతున్నారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఇతర రాజకీయ పార్టీలు కూడా పెద్దగా విలువను ఇచ్చే  పరిస్థితి లేదని - ఎన్నికల ముందే వాళ్లే కోరినప్పుడు చేతులు కలిపి ఉంటే ఇమేజ్ ఉండేదని - ఇలా డ్యామేజ్ అయ్యేది కాదని జనసేన వర్గాలు అంటున్నాయి. అయినా ఇప్పుడు  ఏమని ఏం ప్రయోజనం లేదనే సంగతి తెలిసిందే!
Tags:    

Similar News