ట్వీట్లతో సమస్యలు తీరుతాయా...?

Update: 2015-04-10 11:39 GMT
రాజకీయ నేతలంటే సమస్యలపై స్పందించాలి... అందులోనూ సామాజిక బాధ్యత తలకెత్తుకున్నామని చెప్పే నేతలైతే ఇంకా యాక్టివ్‌ గా ఉండాలి. కానీ.... జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ప్రజా సమస్యలపై ట్విట్టర్‌ లో పోస్టింగు పెట్టి సరిపెట్టేస్తున్నారు.

    ఆ మధ్య రాజధాని భూములపై హడావుడి చేసి మళ్లీ ఒక్క రోజులోనే చల్లారిన ఈ నాయకుడు చాలారోజుల తరువాత ఇప్పుడు సడెన్‌ గా మరోసారి భూసేకరణ అంశంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రయోగిస్తామని ప్రకటించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. రాజధాని కోసం భూములు సమీకరించిన ప్రభుత్వం ,అందుకు ఇష్టపడని రైతుల నుంచి భూ సేకరణ చట్టం కింద సేకరిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన ఆక్షేపిస్తున్నారు.భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల జోలికి వెళ్లరాదని అన్నారు. భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకుంటే తాను వ్యతిరేకిస్తానని, రైతులకు అండగా ఉంటానని, వారి తరపున పోరాడతానని చెప్పారు.ఈ మాట చెప్పినందుకు రైతులు సంతోషించవలసిందే. అయితే.... ఆయన వెర్షన్‌ అంతా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ లో పెట్టారు. మరి దాన్ని ఎంతమంది రైతులు చూశారో ఏమో. అంతేకాదు... గతంలో మాటిచ్చి నిలబెట్టుకోలేదని.. ఇప్పడు ట్వీట్‌ చేసి ఏమాత్రం నిలబెట్టుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రమంతా ఎన్‌ కౌంటర్ల గురించి మాట్లాడుతుంటే పవన్‌ దానిపై ఏమాత్రం స్పందించకపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంటెంపరీ విషయాలను పట్టించుకోని వారు ప్రజా నాయకులు ఎలా అవుతారని అంటున్నారు.

Tags:    

Similar News