బాబు చేసిన తప్పునే పవన్ చేస్తున్నారా?

Update: 2020-01-19 04:51 GMT
ఆశ ఉండటం తప్పేం కాదు. అది అత్యాశగా ఉండకూడదు. ఏపీలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు తెలంగాణ మీద కూడా ఫోకస్ చేయనున్నట్లుగా చెబుతున్న మాటలు చూస్తే.. రాజకీయాల పట్ల ఆయనకున్న మెచ్యూరిటీ మీద కొత్త సందేహాలు కలిగేలా చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తెలంగాణలో.. లేదంటే ఏపీలో మాత్రమే రాజకీయాలు చేసే పరిస్థితి ఉంది. బాబు మాదిరి రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఏ మాత్రం వర్క్ వుట్ కాని పరిస్థితి.

ఈ విషయాన్ని ఇప్పటికి గుర్తించని టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీని కంటిన్యూ చేస్తే.. దారుణమైన ఎదురుదెబ్బలు తింటున్నారు. దీన్నిచూసైనా పాఠాల్ని నేర్వని పవన్.. బాబు బాటలోనే నడుస్తున్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యల్నిచూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఏపీలో బీజేపీతో పొత్తు విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ.. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే బీజేపీతో తాము పొత్తు పెట్టుకుంటున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

పొత్తు విషయంలో ఇరు పక్షాల మధ్య ఎలాంటి షరతులు లేవన్న పవన్.. తెలంగాణ రాజకీయాల మీదా తను ఫోకస్ చేస్తామని చెప్పారు. గతంలో బాబు చెప్పిన రీతిలోనే తాను కూడా నెలలో కొద్ది రోజులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఫోకస్ చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్ మహానగరం మీద దృష్టి పెట్టనున్నట్లుగా తెలిపారు. పవన్ మాటల్ని విన్నప్పుడు అనిపించేది ఒక్కటే. ముందు ఏపీ మీద పూర్తిస్థాయిలో పని చేసిన తర్వాత తెలంగాణ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంతే తప్ప.. రెండు పడవల మీద కాళ్లు పెట్టటం ఏ మాత్రం సరికాదని చెప్పక తప్పదు.

తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే.. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడలేని పరిస్థితిని జనసేన అధినేత ఎందుకు గుర్తించటం లేదన్నది ప్రశ్న. ఏపీలో నెగ్గిన తర్వాత తెలంగాణ మీద దృష్టి పెడితే అంతో ఇంతో లాభం ఉంటుందే తప్పించి.. ఉత్తినే రాజకీయాలు చేయటం ప్రయోజనం శూన్యమన్నది మర్చిపోకూడదు.


Tags:    

Similar News