కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని, విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని పార్లమెంటులో ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు...కొద్దిరోజులుగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ఇన్ని నిధులు కేటాయించామని, విభజన హామీలను నెరవేరుస్తున్నామని ....త్వరలోనే మరిన్ని నిధులు కేటాయించబోతున్నామని ...కేంద్రం బల్లగుద్దిమరీ చెబుతోంది. మరోవైపు, విభజనానంతరం లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీకి కేంద్రం నుంచి అరకొర సాయం మాత్రమే అందిందని, విభజన హామీలు ఇంకా నెరవేరలేదని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. అసలింతకీ ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవం? ఇదే సందేహం సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడితోపాటు జనసేన అధ్యక్షుడు - సినీనటుడు పవన్ కల్యాణ్ కు కూడా కలిగింది. ఆ విభజన హామీ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(సంయుక్త నిజనిర్థారణ కమిటీ) ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పొలిటికల్ జేఏసీ తరహాలోనే, ఏపీలోని మేధావులతో, రాజకీయ నాయకులతో కలిసి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (పీజేఏసీ) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీలో టీడీపీని వ్యతిరేకించే ఉండవల్లి అరుణ్ కుమార్ - జయప్రకాశ్ నారాయణ్ వంటి వారిని భాగస్వాములవుతారని కూడా పవన్ చెప్పారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం జేపీని పవన్ కలిశారు. అంతేకాకుండా, ఈ నెల 11న పవన్ ను కలవబోతున్నానని ఉండవల్లి ప్రకటించారు. ఈ నేపథ్యంలో, టీడీపీపై మరింత దూకుడు వైఖరిని ప్రదర్శించేందుకు పవన్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న టామ్ అండ్ జెర్రీ డ్రామాల వెనుక అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి జేఎఫ్ సీని ఏర్పాటు చేయాలని పవన్ భావిస్తున్నారు. ఆర్థికవేత్తలు - ఆర్థికరంగ నిపుణులు, ప్రభుత్వ మాజీ అధికారులు - విద్యావేత్తలు - సామాజికవేత్తలు - రాజకీయ నాయకులు, తదితరులతో జేఎఫ్ సీని ఏర్పాటు చేయాలని ట్విటర్ లో తెలిపారు. వ్యక్తిగత - రాజకీయ - సిద్ధాంతాలకు అతీతంగా వారంతా విభజన హామీల అమలు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృతంగా చర్చించాలని పవన్ ట్వీట్ చేశారు. వారు సమర్పించిన నివేదిక ఆధారంగా జేపీఏసీ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని పవన్ అన్నారు.
టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను పవన్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన టీడీపీ ఇప్పుడు అతి తక్కువ నిధులు విడుదల కావడంపై ఎందుకు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదన్న విషయాన్ని టీడీపీ హఠాత్తుగా గుర్తించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని, అందుకు గల కారణాలను తెలుసుకోవాలని వారు భావిస్తున్నారని పవన్ అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎలాగూ వస్తాయని జనసేన గతంలోనే చెప్పిందని, ఆ నిధులు రాష్ట్రం హక్కని పవన్ అన్నారు. తనతోపాటు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా ప్రత్యేక ప్యాకేజీని ఖండించారని చెప్పారు. ఏది ఏమైనా పవన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే....టీడీపీతో దోస్తీకి త్వరలోనే పవన్ గుడ్ బై చెప్పేలా కనిపిస్తోంది.