పవన్ కొత్త వ్యూహం.. ఆంధ్ర సెంటిమెంట్

Update: 2018-05-18 15:55 GMT
తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్‌ కు ఎంతగా కలిసొచ్చిందో.. ఆయన్ను, ఆయన పార్టీ టీఆరెస్‌ ను ఎంతగా బలీయం చేసిందో అందరికీ తెలిసిందే. కేసీఆర్ అనుభవాలు చూసో ఏమో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆంధ్ర సెంటిమెంటు రగిల్చి మైలేజి సాధించాలనే వ్యూహంతో కనిపిస్తున్నారు. తాజాగా విశాఖలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 నుంచి ఇచ్ఛాపురంలో మొదలుపెట్టి యాత్ర చేస్తానని చెప్పిన ఆయన అంతకుముందు జైఆంధ్ర అమరవీరులకు నివాళులర్పిస్తానన్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో 372 మంది వరకూ ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయారని, వారి త్యాగాన్ని గుర్తించి గౌరవించుకోలేని దుస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారన్నారు. దీంతో కేసీఆర్ తాను చేపట్టిన కార్యక్రమాల సమయంలో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించినట్లే పవన్ ఇప్పుడు జై ఆంధ్ర ఉద్యమకారులకు నివాళులర్పించి ఆంధ్ర సెంటిమెంటు రగిలించే యోచనలో ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
    
మరోవైపు ప్రజలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ అన్నారు. తొలుత జనం సమస్యలను అర్థం చేసుకుంటానని.. ఆ తరువాతే సీఎంను అవుతానని అన్నారు.  గంగవరం వెళ్లి పోర్టు నిర్వాసితులతో మాట్లాడుతున్నప్పుడు అభిమానలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో ఆయన ఇలా స్పందించారు.
    
టీడీపీ - బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయన్నారు. అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. తాను బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.  కేంద్రంప్రత్యేక హోదా - రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చలేదని, దీనిపై సరైన సమయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనసేన ఈ విషయంలో మొదట్నుంచీ ఒకే మాట మీద ఉందన్నారు. అందుకే పోరాట యాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
    
రాజకీయ జవాబుదారీతనం లక్ష్యంగా 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని తీరప్రాంతంలో గంగపూజ చేసి, జై ఆంధ్రలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించి 45 రోజుల జనసేన పోరాటయాత్ర ప్రారంభిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి నుంచి అక్కడి వారిని కాపాడటానికి హార్వర్డ్‌ నుంచి నిపుణలను రప్పిస్తే వారి అమూల్యమైన సహాయ సహకారాలను ప్రభుత్వం తీసుకోలేకపోయిందని పవన్ అభిప్రాయపడ్డారు. 
Tags:    

Similar News