ఆంధ్రుడికి మంటపుట్టేలా పవన్ తాజా ట్వీట్

Update: 2017-01-23 06:43 GMT
రెండు అక్షరాల ట్వీట్ ను ఆయుధంగా చేసుకొని జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెలగిరేపోతున్నారు. గతంలో అప్పుడప్పుడు మాత్రమే ట్విట్టర్ లో ట్వీట్లు చేసే ఆయన.. గడిచిన వారంలో ఆయన వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. నిన్నటికి నిన్న మధ్యాహ్నం వేళలో పోలవరం మీద ఏపీ సర్కారు.. అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. రాత్రి అయ్యేసరికి.. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందుకు నిరసనగా యువత మెరీనా బీచ్ తరహాలో నిరసన చేసిన పక్షంలో తాను మద్దతు ఇస్తానని చెప్పటం ద్వారా ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసిన పవన్.. గంటల వ్యవధిలోనే మరింత ఘాటుగా ట్వీట్లు చేశారు.

కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఉత్తరాధి అహంకారం.. దక్షిణాదిని చిన్నచూపు చూస్తోందన్న భావం వచ్చేలా పవన్ ట్వీట్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘గాంధీని ప్రేమిస్తాం. అంబేడ్కర్ ను ఆరాధిస్తాం. సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ.. సంస్కారం లేని ఉత్తరాది నాయకత్వాన్ని మాత్రం భరించలేం. దక్షిణాది భారత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూ.. కించపరిస్తే మాత్రం చూస్తూ కూర్చోం. మెడలు వంచి కూర్చోపెడతాం’’ అని ట్వీట్ చేశారు.

‘ఉత్తరాది రాజకీయ నేతలు దక్షిణ భారత దేశంలో ఎన్ని భాషల వారు ఉన్నరన్నది తెలుసా? వారికి తెలిసిందల్లా అందరూ మద్రాసీలే’ అంటూ మండిపడ్డారు. అదే సమయంలో ఏపీ రాజకీయ వర్గాలపైనా పవన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవం.. బాధ్యత లాంటి గుణాలు ఏపీ రాజకీయ నేతలకు లేవన్న ఆయన.. ఏపీ యువతకు శాంతియుత నిరసనలతో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీని సాధించుకునేందుకు శాంతియుత నిరసనల్ని చేపట్టాలన్న తాజాగా ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News