రాజుగారి కోట ద‌గ్గ‌ర ఎట‌కారం చేసిన ప‌వ‌న్‌!

Update: 2018-06-03 04:30 GMT
ఆవేశంతో వ్యాఖ్య‌లు చేయ‌టం.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడ‌టం.. ధ‌డేలున హామీలు ఇచ్చేయ‌టం.. ఆ త‌ర్వాత వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లాంటి గుణాలున్న తెలుగు ముఖ్య‌నేత‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చెప్పాలి. త‌న‌ను విమ‌ర్శించిన వారిని.. త‌ప్పు ప‌ట్టిన వారిని అదేప‌నిగా విమ‌ర్శించ‌టం ప‌వ‌న్ కు అల‌వాటు. న‌న్ను అంటావా? అన్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది.

ఆచితూచి మాట్లాడ‌టం త‌న‌కు అల‌వాటుగా చెప్పే ప‌వ‌న్‌.. టైంకు అనుకూలంగా త‌న తీరును మార్చేసుకుంటారు. నాలుగేళ్లు బాబుకు ఫ్రెండ్ గా ఉన్న ప‌వ‌న్‌కు.. బాబులోని అనుభ‌వం క‌నిపించిందే త‌ప్పించి.. ఆయ‌న స‌ర్కారు చేసిన త‌ప్పులు అస్స‌లు క‌నిపించ‌లేదు. అదేం సిత్ర‌మో కానీ.. ఈ అనుభ‌వం రాత్రికి రాత్రే మాయ‌మైపోయి.. బాబు చేసిన త‌ప్పులు.. వారి అబ్బాయి గారి అవినీతి క‌నిపించేసింది. అంతే.. అప్ప‌టివ‌ర‌కూ బాబును ప‌ల్లెత్తు మాట అనేందుకు సైతం వెనుకాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇప్పుడు బ‌ట్ట‌లు ఊడ‌దీసి మ‌రీ.. బండ‌కేసి బాదిన‌ట్లుగా విమ‌ర్శ‌ల‌తో బాదేస్తున్నాడు. ఎప్పుడు క‌ర్మ సిద్ధాంతాన్ని మాట్లాడే ప‌వ‌న్‌.. ఈ మ‌ధ్య‌న మాత్రం 2014 ఎన్నిక‌ల్లో త‌న కార‌ణంగానే తెలుగు త‌మ్ముళ్లు అధికారాన్ని అనుభ‌విస్తున్న వైనాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు.

ప‌ద‌వుల మీద ఆశ లేద‌న్న మాట‌ను చెప్పే ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న త‌న మ‌న‌సులో దాచి పెట్టుకున్న సీఎం కుర్చీ క‌ల‌ల గురించి బ‌య‌ట‌పెట్టేస్తున్న వైనం తెలిసిందే. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణా.. నాకు తెలీద‌న్న టీడీపీ సీనియ‌ర్ నేత.. మాజీ కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు మాట‌లు ప‌వ‌న్‌ను భారీగా హ‌ర్ట్ చేశాయి. ఇప్ప‌టికే ప‌లుమార్లు అశోక్ గ‌జ‌ప‌తి రాజును వ్యంగ్యంగా ఏసుకున్న ప‌వ‌న్‌.. తాజాగా ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా అశోక్ గ‌జ‌ప‌తిని ఏసుకున్నారు. తాను ఎవ‌ర‌న్న‌ది తెలీద‌ని తేలిగ్గా తీసేసిన దానికి ప్ర‌తిగా.. నాటి విష‌యాన్ని గుర్తు చేస్తూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. విజ‌య‌న‌గ‌రం కోట జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగిన స‌భ‌లో మాట్లాడుతూ ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తి మీద ఎట‌కారంగా ఏసుకున్నారు. అశోక్ గారూ.. నేను మీ విజ‌య‌న‌గ‌రం వ‌చ్చాను. మీ కోట ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాను. నా పేరేనండి ప‌వ‌న్ క‌ల్యాణ్.. న‌న్ను ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేశారు. త‌న మాట‌ల‌కు ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి మ‌రింత మ‌సాలాను రంగ‌రించేశారు.

తాను అశోక్ గ‌జ‌ప‌తి కోసం 2014లో ప్ర‌చారం చేయ‌టానికి వ‌చ్చిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ఆయ‌న అనుభ‌వించిన కేంద్ర మంత్రి ప‌ద‌వి.. ప్ర‌భుత్వం ఏర్పాటుకు కార‌కుడినంటూ త‌న గొప్ప‌త‌నం గురించి తానే చెప్పేసుకున్నారు. నాకు గుర్తుంది. మీరు పెద్ద‌లు. రాజ‌వంశీయులు అంటూ ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ ట‌చ్ కావాలో అక్క‌డ ట‌చ్ చేసేలా మాట్లాడిన ప‌వ‌న్ .. త‌న‌కు జ‌రిగిన అవ‌మానానికి అంత‌కు అంత అన్న‌ట్లుగా ప‌వ‌న్ తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఓ ప‌క్క వ్యంగ్యంగా ఏసుకుంటూనే.. మ‌రోవైపు త‌న‌కు పెద్ద‌ల్ని అగౌర‌ప‌రిచే సంస్కారం లేద‌ని.. ప‌వ‌న్ ఏం చేవాడో 2019 ఎన్నిక‌ల్లో చెబుతామ‌ని చెప్పారు. చూస్తుంటే.. అశోక్ జారిన మాట‌ను ప‌వ‌న్ ఇప్ప‌ట్లో వ‌దిలేట‌ట్లుగా క‌నిపించ‌ట్లేద‌ని చెప్పక త‌ప్ప‌దు. అశోక్ లాంటి రాజ‌వంశీయుడు త‌న లాంటోడ్ని అవ‌మానించిన వైనాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టం ద్వారా.. రాజ‌కీయ ల‌బ్థి పొందాల‌న్న‌ట్లుగా ప‌వ‌న్ తీరు ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News