పవన్ కల్యాణ్.. అడ్డంగా బుక్ అయ్యాడా!

Update: 2019-03-23 06:20 GMT
ఏపీలో ఎన్నికల వేళ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తెలంగాణలో ఏపీ మూలాలున్న ప్రజల మీద దాడులు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. పచ్చని గోదావరి జిల్లాల మీద తెలంగాణ నేతల దిష్టి పడిందని కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించాడు. ఈ మాటలు విధ్వేష రాజకీయాన్ని తలపింపజేస్తున్నాయి.

రాష్ట్రం విడిపోయినా.. తెలంగాణ - ఏపీల మధ్యన పెద్దగా వివాదాలు ఏమీ లేవు. వివాదాలు ఏమైనా ఉన్నాయంటే అవి రాజకీయ నేతలు సృష్టించినవే. రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్ లోని సీమాంధ్రులు అక్కడే ఉన్నారు. ఎవరూ తరలి వెళ్లిపోలేదు. కేసీఆర్ ను తీవ్రంగా ధ్వేషించే వారు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. వారి మనుగడకు వచ్చిన ముప్పు ఏమీ లేదు.

ఇక హైదరాబాద్ లో స్థిరాస్తులను కలిగిన వారు కూడా ఎంచక్కా అక్కడే ఉన్నారు. రాష్ట్రం విడిపోయిందని ఆస్తులు అమ్ముకుని సీమాంధ్రకు వెళ్లిపోయిన సామాన్యులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సామాన్యులు కానీ, డబ్బులున్న వాళ్లు కానీ, సెలబ్రిటీలు కానీ.. ఎక్కడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. పైపెచ్చూ సీమాంధ్ర వ్యాపారులు, సినిమా వాళ్లతో తెలంగాణ రాష్ట్ర సమితి వారు  చట్టాపట్టాలేసుకు తిరుగుతున్న వైనం కనిపిస్తూనే ఉంది.

ఇక ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ కుటుంబం - పవన్ కల్యాణ్ స్వయంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాపురం ఉంటూ ఉన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబానికి హైదరాబాద్ లో - తెలంగాణలో ఆస్తులకు కొదవలేదు.వాటి విషయంలో పవన్ కల్యాణ్ ఏనాడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలంతా హైదరాబాద్ లోనే ఉంటారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మెగా ఫ్యామిలీ కేసీఆర్ తో - కేటీఆర్ తో మెయింటెయిన్ చేస్తున్న సత్సంబంధాలు మరో ఎత్తు. కేటీఆర్ తో మెగా కుటుంబీకులు ఫంక్షన్లలో సెల్ఫీలు దిగుతారు.  తన అవసరం మేరకు పవన్ కల్యాణ్ కూడా వెళ్లి కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ పాలనను అప్పుడంతా మెచ్చుకున్నారు. అప్పుడెప్పుడూ కేసీఆర్ విషయంలో ఈ తరహా ఆరోపణలు చేయలేదు కూడా!

ఇక కొన్ని నెలల కిందటే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని, తను కూడా కారు గుర్తుకే ఓటేసినట్టుగా వీడియో కూడా విడుదల చేశాడు! ఇదీ కథ. ఈ విధంగా తమ  అవసరం మేరకు, ఇన్ని రోజులూ కేసీఆర్ పాలన మీద కానీ - తెలంగాణలో పరిణామాల గురించి కానీ అద్భుతం అని స్పందించి, ఇప్పుడు మాత్రం విధ్వేష రాజకీయాలు చేయడం - హైదరాబాద్ లో సీమాంధ్రులపై దాడులు జరుగుతున్నయని లేని ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం.. విమర్శలకు దారి తీస్తూ ఉంది. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ క్రెడిబులిటీ కోల్పోతున్నాడు ఈ మాటలతో అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News