ప‌వన్ పోటీ చేసేది ఎక్క‌డి నుంచో తేలింది

Update: 2019-02-16 05:11 GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ  రాబోయే ఎన్నిక‌ల‌కు వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతోంది. సినిమాల‌ను ప‌క్క‌న‌పెట్టి పార్టీకే పూర్తి స‌మ‌యం కేటాయిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోయే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని కృషి చేస్తున్నారు. ఇటీవ‌లే, పార్టీ నుంచి బ‌రిలో దిగే ఆశావ‌హుల కోసం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొద‌లుపెట్టారు. దీంతో పాటుగా ఈ ద‌ర‌ఖాస్తుల‌ను వ‌డ‌పోసేందుకు జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

పార్టీలో టికెట్ కోసం తాను సైతం స్క్రీనింగ్ క‌మిటీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌ని ప్ర‌క‌టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని - అసెంబ్లీ - పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ ద్వారానా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. అయితే ఈ ద‌ర‌ఖాస్తు నేప‌థ్యంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే చ‌ర్చ మొద‌లైంది. ఉత్తరాంధ్ర నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న రాయ‌ల‌సీమ‌, తాడేప‌ల్లి గూడెం, ఏలూరు నియోజ‌వ‌ర్గాల‌పై క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్లాన్ మార్చిన‌ట్లు చెప్తున్నారు.

ఉత్తరాంధ్రపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన జ‌న‌సేనాని గాజువాక నుంచి బరిలోకి దిగనున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌న‌సేన పార్టీకి సంబంధించి రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. దీంతో,  గాజువాక నుంచి పోటీకే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపుతోందన్న సమాచారం ఉంది. పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపితే, విజ‌యం ఖాయ‌మ‌ని భావిస్తున్న జ‌న‌సేన వ‌ర్గాలు త్వ‌ర‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News