ప‌వ‌న్ కు క‌వాతు స‌ల‌హా ఇచ్చిందెవ‌రో?

Update: 2018-10-15 09:32 GMT
రాజ‌మండ్రిలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్ పై నేడు జనసేన భారీ క‌వాతును త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. పిచ్చుక లంక నుంచి కాటన్‌ విగ్రహం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర గంటన్నర సేపు ఆ కవాతును భారీస్థాయిలో నిర్వ‌హించేందుకు జ‌న‌సేన ఏర్పాట్లు చేసింది. ఆ క‌వాతులో పాల్గొనేందుకు ల‌క్ష‌లాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. అయితే, ఆ క‌వాతు నిర్వ‌హ‌ణ‌కు పోలీసులు బ్రేక్ వేశారు. క‌వాతుకు బ్రిడ్జి అనుకూలంగా లేద‌ని ...జ‌న‌సేన విన‌త‌ని తిర‌స్క‌రించి నేత‌ల‌కు వారు నోటీసులు ఇచ్చారు. బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉంద‌ని, అందువల్ల 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. కాటన్‌ సెంటర్లో జరిగే బహిరంగ సభాప్రాంగణం కూడా భారీ జ‌న‌సమీక‌ర‌ణ‌కు సరిపోదని, వేరే చోట సభ నిర్వహించుకోవాలని చెప్పారు. ఆ నోటీసులపై జ‌న‌సేన వ‌ర్గాలు స్పందించ‌లేదు.

ఈ క‌వాతుకు పోలీసుల అనుమ‌తి నిరాక‌ణ వెనుక ప్ర‌భుత్వం హ‌స్తం ఉందా లేదా అన్న సంగ‌తి కాసేపు ప‌క్క‌న‌బెడ‌దాం. రాజ‌కీయ పార్టీగా క‌వాతులు - స‌భ‌లు నిర్వ‌హించుకునే హ‌క్కు జ‌న‌సేన‌కుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, అస‌లు అంత‌టి పురాత‌న బ్రిడ్జిపై ల‌క్ష‌లాది మందితో క‌వాతు నిర్వ‌హ‌ణ సాధ్య‌మా అన్నవిష‌యాన్ని జ‌న‌సేన వ‌ర్గాలు ముందుగా ఆలోచించి ఉండాల్సింది.  కొన్ని అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకొనుంటే క‌వాతు, స‌భ స‌క్సెస్ అవుతుంద‌నే విష‌యాన్ని జ‌న‌సేనాని స‌ల‌హాదారులు మ‌ర‌చిపోయారు. అయితే, స‌ల‌హాదారుల స‌ల‌హాల‌ను ప‌వ‌న్ విస్మ‌రిస్తున్నారా....లేక ఆ స‌ల‌హాదారులే సరైనోళ్లు కారా అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌వ‌న్ కు త‌ప్పుడు స‌ల‌హాలు ఇచ్చేవారు ఎక్కువ‌య్యార‌ని...కొంత‌మంది పార్టీ వీడిన‌ ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. అటువంటి నేప‌థ్యంలో ఈ క‌వాతు, స‌భ వైఫ‌ల్యాల‌ల‌కు జ‌న‌సేన స‌ల‌హాదారుల‌దే బాధ్యత అన్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

పోనీ, పోలీసులు అనుమ‌తులను పెడ‌చెవినబెట్టి జ‌న‌సేన క‌వాతు, స‌భ‌ల‌ను కొన‌సాగించింద‌నుకుందాం. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ జ‌న‌సేన‌కు మంచిపేరుక‌న్నా...చెడ్డ‌పేరు వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌. ఆ పాత బ్రిడ్జిపై బ‌ల‌నిరూప‌ణ చేయ‌డం వ‌ల్ల భారీగా జ‌నం క‌నిపించి జ‌న‌సేన‌కు విప‌రీత‌మైన‌ ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌నడన్న ఆశ తప్ప వేరే విష‌యాలేవీ పార్టీ ఆలోచించిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. బ్యారేజ్ కు ఇరువైపులా 3 అడుగుల ఎత్తులో మాత్రమే ఉండే రైలింగ్ ....జ‌న‌సేన అభిమానులు అత్యుత్సాహాన్ని ఎంత‌వ‌ర‌కు ఆప‌గ‌ల‌ద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం.  ఒక‌వేళ అభిమానులెవ‌న్నా అదుపుతప్పి కింద‌ప‌డ్డా...అనూహ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వాస్త‌వానికి భారీ సంఖ్య‌లో మ‌నుషులు బ్రిడ్జిపై క‌వాతు చేయ‌కూడ‌ద‌ని సైన్స్ కూడా చెబుతోంది. ఒకే పౌనఃపున్యంతో ఒకే స‌మ‌యంలో భారీ సంఖ్య‌లో జ‌నం న‌డ‌వ‌డం వ‌ల్ల బ్రిడ్జి కూలిపోయే ప్ర‌మాదం ఉంది. అందుకే, సైనికులు కూడా  ఎట్టి ప‌రిస్థితుల్లో బ్రిడ్జిలపై క‌వాతు చేయ‌రు. కానీ, జ‌న‌సేన మాత్రం ల‌క్ష‌లాది మందితో క‌వాతుకు ప్లాన్ చేయ‌డం అనాలోచితం అనిపించ‌క మాన‌దు. క‌వాతు త‌ర్వాత కూడా బ్యారేజ్‌ దిగువన నిర్వహించే బహిరంగ సభ నిర్వ‌హించే ప్రాంతం భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు అనుకూలం కాదు. 10వేల మంది కూడా నిలబడలేని ఆ ప్రాంతంలో లక్షలాది మందితో స‌భ ఎంత రిస్కో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. త‌న సినిమా ఫంక్ష‌న్ల‌కు, రాజ‌కీయ స‌భ‌ల‌కు వ‌చ్చే అభిమానులు గాయ‌ప‌డినా...ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించినా ప‌వ‌న్ త‌ట్టుకోలేర‌ని గ‌తంలో ప‌లుమార్లు నిరూపిత‌మైంది. అటువంటి ప‌వ‌న్...ఆయ‌న స‌ల‌హాదారుల అనాలోచిత స‌ల‌హాల వ‌ల్ల ఇంత రిస్క్ నిర్ణ‌యం తీసుకున్నారా....లేక వారు ఇచ్చిన స‌ల‌హాను ప‌వ‌న్ విస్మ‌రించారా అన్న‌ది దేవుడికే ఎరుక‌!
Tags:    

Similar News