బీజేపీతో గొడ‌వ‌ల్లేవ్.. విలీనంపై ప‌వ‌న్ క్లారిటీ!

Update: 2019-07-08 04:44 GMT
ద‌మ్ముగా అడుగు.. సూటిగా స‌మాధానం చెబుతా అన్న‌ట్లుగా ఉండేది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌. తాజాగా తానా స‌భ‌ల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఆయ‌న్ను ఒక ఛాన‌ల్ ప్ర‌త్యేకంగా మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వ‌చ్చాయి. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాటి నుంచి.. మ‌రి ముఖ్యంగా జ‌న‌సేన ఆవిర్భావం త‌ర్వాత మీడియాను క‌లిసిన ప్ర‌తిసారీ.. ఏ ప్ర‌శ్న అడిగినా సూటిగా స‌మాధానం చెప్పే ధోర‌ణి జ‌న‌సేన అధినేతలో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించేది.

అలాంటి ప‌వ‌న్ తాజాగా కాస్త మారిన‌ట్లుగా క‌నిపించింది. బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా జ‌న‌సేన‌ను వారి పార్టీలో విలీనం చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట క‌దా అని ప‌వ‌న్ ను ప్ర‌శ్నించిన‌ప్పుడు అలాంటిదేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్. అనంత‌రం ఆయ‌న వ‌ర్జీనియాలో తెలుగువారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌ల్లో ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించారు.

ఓట‌మిని తాను అవ‌మానంగా భావించ‌ట్లేద‌న్నారు. దెబ్బ‌లు తిన్నా.. ఓడినా.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌న్న సంక‌ల్పంతో మొద‌లైన త‌న ప్ర‌యాణం ఆగ‌ద‌న్నారు. 2024 వ‌ర‌కూ పార్టీ ఉంటుందా? అని కొంద‌రు అడుగుతున్నార‌ని.. అలాంటి వారంద‌రికి తాను చెప్పేది ఒక్క‌టేనంటూ.. త‌న తొలి సినిమా ఫెయిల్ అయ్యింద‌ని.. అలాంటివేళ ఇంత‌మంది అభిమానుల్ని పొందుతాన‌ని ఎవ‌రైనా ఊహించారా? అని వ్యాఖ్యానించారు. జ‌న‌సేన కూడా అంతేన‌ని చెప్ప‌టం ద్వారా సినిమాల్లో జ‌రిగిందే రాజకీయాల్లో రిపీట్ అవుతుంద‌న్న మాట‌ను ప‌వ‌న్ చెప్పార‌ని చెప్పాలి. అన్నిసార్లు ఒకేలా జ‌రుగుతుందంటారా?


Tags:    

Similar News