పవన్ శాసించారు... ?

Update: 2021-10-04 10:30 GMT
పవన్ కళ్యాణ్ మాటంటే అది శాసనం అవుతోంది. ఏపీ రాజకీయాల్లో పవన్ తనదైన మార్క్ ని బలంగా చూపిస్తున్నారు. పవన్ జనసేన పార్టీకి ఉన్న బలం ఎంత అంటే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే. కానీ ఆయన ఏపీకి వచ్చి సౌండ్ చేసినా ఎక్కడ నుంచో ప్రకటన రిలీజ్ చేసినా ఆ రీసౌండ్ ఒక లెవెల్ లో ఉంటోంది. అధికార పార్టీ అయినా విపక్షాలు అయినా కూడా పవన్ గురించి అనుకూలమో ప్రతికూలమో మాట్లాడక తప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే ఏపీలో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక అన్నది జరగాల్సి ఉందని అందరికీ తెలుసు. ఈ ఏడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్  వెంకట సుబ్బయ్య మృతి చెందారు. దాంతో అక్కడ ఎన్నిక అనివార్యం అని కూడా తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే నోటిఫికేషన్ రాక ముందే వైసీపీ తమ అభ్యర్ధి ఎవరో చెప్పేసింది. వెంకట సుబ్బయ్య సతీమణి సుధకు ఆ పార్టీ టికెట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. మరి ఈ సంగతి తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ నే తిరిగి  బరిలో నిలబెడుతున్నట్లుగా పేర్కొంది. ఆ మేరకు అంతా క్లియర్ గానే ఉంది.

ఇక ఏపీ టూర్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ బస్తీ మే సవాల్ అన్నారు. టైమ్ డేట్ మీరు చెప్పినా సరే యుద్ధం ఎలా కోరుకున్నా సరే మేము రెడీ అన్నారు. సరిగ్గా ఆ టైమ్ లోనే బద్వేల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. దాంతో అంతా జనసేన అక్కడ నుంచి కచ్చితంగా పోటీ చేస్తుంది అనుకున్నారు. దానికి తగినట్లుగా రాయల‌సీమ టూర్ కూడా పవన్ పెట్టుకున్నారు. మొత్తానికి అంతా ఆసక్తిగా జనసేన వైపు చూస్తూంటీ ఆశ్చర్యకరంగా పవన్ బద్వేల్ లో పోటీ లేదు అంటూ తూచ్ అనేశారు. దానికి కారణం చెబుతూ చనిపోయిన అభ్యర్ధి కుటుంబ సభ్యులనే బరిలో  వైసీపీ నిలిపినందువల్ల సానుభూతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. పవన్ చెప్పినది సబబుగానే ఉంది. నిజానికి  ఆయన పోటీ చేస్తామని బయటకు ప్రకటించలేదు. పైగా కేవలం ఒక్క రోజులోనే వ్యవహారం తేల్చేశారు. ఆయన ఏకగ్రీవం చేసుకోవాలని కూడా వైసీపీ నేతలకు సూచించారు.

కానీ టీడీపీ కూడా ఇపుడు అదే మాట అనడమే చిత్రం. నిజానికి టీడీపీ ఎపుడో తన అభ్యర్ధిని ప్రకటించింది. ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు కూడా. కానీ పవన్ సడెన్ గా డెసిషన్ తీసుకున్న మీదటనే టీడీపీకి సాంభూతి అంశం గుర్తుకు రావడం అంటే పవన్ శాసించాడు, తమ్ముళ్ళు పాటించారా అన్న మాటైతే ఉంది.  పవన్ ఒక రాజకీయ పార్టీగా తన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్న టీడీపీ ఎందుకు కన్ఫ్యూజన్ అయింది అన్నదే చర్చ. టీడీపీకి కూడా తెలుసు, వెంకట సుబ్బయ్య సతీమణి పోటీలో ఉంటుందని. తెలిసి కూడా మొదట పోటీకి పెట్టి ఇపుడు మేము బరిలో లేమని చెప్పడం ద్వారా పవన్ని అనుసరించారనే అంటున్నారు. నిజానికి జనసేన పోటీకి రెడీ అంటే అపుడు టీడీపీ ఏమనేదో అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

మొత్తానికి పవన్ తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పి టీడీపీకి దారి చూపించాడా లేక ఇరకాటంలో పెట్టాడా అన్న మాట కూడా ఉంది. అదే టైమ్ లో జనసేన సంగతి అలా ఉంటే ప్రధాన‌ ప్రతిపక్షంగా ఉన్నామని, ఏపీలో వైసీపీకి జనంలో ఆదరణ లేదు, ఈ క్షణం ఎన్నికలు పెడితే ఓడిపోవడం ఖాయమని చెబుతున్న టీడీపీ ఇపుడు అకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకోవడం అంటే రాజకీయంగా రాంగ్ అనే మాట ఉంది. ఉప ఎన్నికలు ఎటూ అధికార పార్టీకే మేలు చేస్తాయి అన్న ఆలోచన ఉన్నపుడు అయిదేళ్ల వరకూ విపక్షాలు అసలు పోటీయే పడకూడదు, కానీ మధ్యలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వీర లెవెల్ లో టీడీపీ పోరాడింది. ఇపుడు మాత్రం బద్వేల్ కి వచ్చేసరికి సానుభూతి అంటూ త్యాగం మార్క్ ఫేస్ పెట్టడం అంటే చేతులెత్తేసినట్లేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

మొత్తానికి చూసుకుంటే రాజకీయంగా టీడీపీ వారంత అనుభవం లేకపోయినా పవన్ కళ్యాణ్ నిర్ణయాలే బాగున్నాయి, ఇతర పార్టీలకు మార్గదర్శకంగా కూడా ఉన్నాయని ఎవరైనా అనుకుంటే అందులో తప్పులేదు. ఇక బద్వేల్ లో చూస్తే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇంకా రేసు నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించలేదు. మరి అలా కనుక చూసుకుంటే ఏకగ్రీవం అయినట్లు కాదు, ఒక వేళ రాజకీయ పార్టీలు నో చెప్పినా ఇండిపెండెంట్లు చాలా మంది పోటీకి సై అంటున్నారు. ఆ విధంగా చూస్తే బద్వేల్ ఉప ఎన్నిక జరిగితీరుతుంది అంటున్నారు. వైసీపీ సునాయసంగా గెలుస్తుంది. అపుడు మేము పోటీలో లేము కాబట్టే ఇంత మెజారిటీ వచ్చిందని టీడీపీ చెప్పుకునేందుకు వీలుంటుందేమో. పరిషత్ ఎన్నికల బహిష్కరణ తరువాత టీడీపీ తీసుకున్న ఈ డెసిషన్ ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో చూడాల్సిందే.
Tags:    

Similar News