కొత్త పాటకు పల్లవి రాయిస్తున్న పవన్!

Update: 2018-02-19 10:40 GMT
పవన్ కు తాను తలచిందే పాట! ఇతరులు చేసే కృషి ఏదీ ఆయనకు కనిపించదు. తాను చేస్తున్నది మాత్రమే పోరాటం అని..  తాను చెబుతున్నది మాత్రమే పరిష్కారం అని అనుకుంటారు. మంచిదే. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన పరిష్కారానికి ఇతరులు స్పందించినప్పుడు.. తనవంతు సహకారం చేయకపోతే ఎలా..? బంతి తన కోర్టులోకి వచ్చేసరికి మౌనం పాటించేస్తే ఎలా? ఈ విపత్కర పరిస్థితి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తనను ఎవరూ అనుమానించకుండా ఎలా తప్పించుకోవాలా? అని పవన్ కల్యాణ్ మేధోమధనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అవిశ్వాసానికి జగన్ సై అనేసిన నేపథ్యంలో.. తాను జగన్ తో కలవడం ఇష్టంలేక.. అవిశ్వాసం సంగతిని ఇక్కడితో పక్కన పెట్టేసి.. తాను కొత్త పాట అందుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త వ్యూహాలు కొత్త మాటలతో ... తాను ఆలపించబోయే కొత్త పాటకు మేధావులతో పల్లవి రాయించే పనిలో ఉన్నారుట.

పవన్ కల్యాణ్ పైకి ఎన్ని మాటలు చెబుతున్నా.. తనకు ఏ పార్టీ అయినా ఒకటే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఎవరికి వారు తమ సొంత రాజకీయ ఎజెండాలతోనే పనిచేస్తున్నారు తప్ప.. తటస్థంగా.. కేవలం రాష్ట్రప్రయోజనాలే లక్ష్యంగా ఎవ్వరూ పనిచేయడం లేదనే సంగతి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా ఎంత మాత్రమూ మినమాయింపు కాదని ప్రజలు గుర్తిస్తున్నారని జనసేన కోటరీ తెలుసుకోవాల్సి ఉంది.

అభినందించకుంటే.. అనుమానిస్తారు!

పవన్ కల్యాణ్ ఒక ప్రతిపాదన చేశాడు. వైసీపీ - టీడీపీలకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టవచ్చునని ఆయన అన్నారు. దీనికి స్పందనగా తాము రెడీ అవిశ్వాసం పెడతాం అని జగన్ ఒప్పుకున్నారు. మరి జగన్ మాటకు పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా స్పందించలేదు. తాను తటస్థంగా ఉంటూ.. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను కోరుకునే వ్యక్తి మాత్రమే అయితే గనుక... ఆయన ఈసరికే జగన్ ప్రతిపాదనను అభినందిస్తూ - ఆహ్వానించి ఉండాల్సింది. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే మిగిలిన పార్టీలు కూడా కలిసి రావాలని ఒక పిలుపు ఇచ్చి ఉండాల్సింది. కానీ ఆయన వైపు నుంచి అలాంటిదేమీ జరగడం లేదు. వైసీపీ చేసిన ఏ ఒక్క పనినీ అభినందించకపోయినా పర్లేదు - కనీసం తాను ప్రతిపాదించిన దానికి సిద్ధపడడాన్ని కూడా ఆహ్వానించకపోతే.. ఆయన చిత్తశుద్ధినే ప్రజలు అనుమానిస్తారని ఆయన తెలుసుకోవాలి.

Tags:    

Similar News