పవన్ కల్యాణ్ కు హుందాతనం కావాలట!

Update: 2019-08-05 04:46 GMT
రాజకీయాలు హుందాగా ఉండాలి..' ఇదీ శ్రీమాన్ పవన్ కల్యాణ్ గారి తాజా ఉవాచ. ఇలాంటి నీతి వచనాలు తెగ చెప్పడం పవన్ కల్యాణ్ కు కొత్త ఏమీ కాదు. ఎదుటి వాళ్లకు నీతులు చెప్పడంలో పవన్ కల్యాణ్ కు ఎంతో అనుభవం కూడా ఉంది. అయితే అలాంటి నీతులను తను మాత్రం పాటించరు!

ఉదాహరణకు పవన్ కల్యాణ్ చెప్పిన  తాజా హుందాతనం నీతినే ఒకసారి పరిశీలిస్తే.. అసలు పవన్ ప్రసంగాల్లో అది ఉంటుందా? అనేది స్పష్టం అవుతుంది.  ఇప్పుడు కాదు.. పదేళ్ల  కిందటే 'కాంగ్రెస్ నేతల పంచెలు ఊడగొట్టండి..' అని పిలుపునిచ్చిన ప్రబుద్ధుడు పవన్ కల్యాణ్. పంచెలూడగొట్టాలి, తరమాలి.. అని అనడం హుందాతనం అవుతుందేమో పవన్ కల్యాణ్ కే తెలియాలి! ఇక ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో పవన్ కల్యాణ్ హద్దు మీరి మాట్లాడారు. హుందాతనం అనేది లేకుండా మాట్లాడారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా పవన్ కల్యాణ్ అనుచితంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. జనసేన అధిపతి అప్పుడు ప్రాంతాల మధ్యన విబేధాలు రేకెత్తించేలా కూడా మాట్లాడారు.

తెలంగాణలో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారంటూ - గోదావరి జిల్లాల్లోకి రాయలసీమ సంస్కృతిని రానివ్వనంటూ.. ఇలా ప్రాంతాల మధ్యన విద్వేషాలను పెంచేలా  మాట్లాడింది కూడా పవన్ కల్యాణే. అలాంటి వ్యక్తి ఇప్పుడు 'రాజకీయాలు- హుందాతనం' అంటూ నీతులు వల్లె వేస్తూ ఉన్నారు. అలాంటి హుందాతనాన్ని పవన్ కల్యాణ్ నేర్చుకుంటే మంచిదేమో అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!

Tags:    

Similar News