ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ని అయిపోయిందా?

Update: 2020-10-06 14:00 GMT
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పిన జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ అనేక ప్ర‌శ్న‌లు చుట్టుముడుతున్నాయి. రాజ‌కీయాల‌న్నాక‌.. నిరంతరం ప్ర‌జ‌ల్లో ఉండాలి. ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డాలి. వారి క‌ష్టాలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. అదే స‌మ‌యంలో పార్టీని క్షేత్ర‌ స్థాయిలోకి తీసుకు వెళ్లాలి. బ‌లోపేతం చేసుకోవాలి. గ‌తంలో ఎన్టీఆర్‌.. ఎంతో ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ.. చైత‌న్య ర‌థ‌యాత్ర పేరుతో ఉమ్మ‌డి రాష్ట్రం న‌లుచెర‌గులా తిరిగారు. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అదే రేంజ్‌లో ఓదార్పు యాత్ర‌లు, పాద‌యాత్ర చేశారు. వేల కిలో మీట‌ర్లు తిరిగి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు.

కానీ, ఎటొచ్చీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మెగా ఫ్యామిలీ మాత్రం ఇలాంటి వాటిపై దృష్టి పెట్ట‌కుండా.. అధికారం.. ప‌ద‌వులు ఆకాశం నుంచి ఊడిప‌డాల‌నే టైపులో వ్య‌వ‌హ‌రించ‌డం రాజ‌కీయంగా వారిని పైమెట్టుకు చేర్చ‌లేక పోతోంద‌నే చెప్పాలి. గ‌తంలో సామాజిక న్యాయం అంటూ.. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి. ఈ క్ర‌మంలోనే యువ‌రాజ్యం విభాగానికి ప‌వ‌నే అధ్య‌క్షుడిగా ఉండి న‌డిపించారు. ఇంకేముంది 2009లో అధికారం త‌మ‌దేన‌ని ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, 18 సీట్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది.  పోనీ.. అప్పుడైనా క్షేత్ర‌స్థాయిలో పార్టీని నిల‌బెట్టుకున్నారా? అంటే అది కూడా లేదు.

వైఎస్ మ‌ర‌ణానంత‌రం.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్రంలో ప‌ద‌వి కొట్టేశారు. మ‌రి పార్టీని న‌మ్ముకున్న నాయ‌కులు ఏం కావాలి?  వారిని గాలికి వ‌దిలేశారు. ఆ ఎపిసోడ్‌ లో చిరు కుటుంబం బాగానే లాభ‌ ప‌డింది. దీంతో అటు చిరు, ఇటు ప‌వ‌న్‌పై కూడా నాయ‌కులు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిపోశారు.  ఆ త‌ర్వాత ప‌రిణామాల్లో ప‌వ‌నే ఏకంగా సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. ఇంకేముంది.. ప్ర‌శ్నించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, త‌న‌కు కుల మ‌తాల‌తో సంబంధం లేద‌ని అన్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ పెట్టిన ఆయ‌న బీజేపీ, టీడీపీ కి కూట‌మి కి మ‌ద్ద‌తు ప‌లికారు. తాను మాత్రం పార్టీ నిర్మాణం లేద‌నే మిష‌ తో పోటీ కి దూరంగా ఉన్నారు.

పోనీ.. త‌ర్వాత అయినా.. పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టారా? అంటే.. అది కూడా లేదు. తాను రంగంలోకి దిగితే.. ల‌క్ష‌ల సంఖ్య‌ లో ప్ర‌జ‌లు వ‌స్తార‌ని, ఈల‌లు వేస్తార‌ని, త‌న డైలాగుల‌కు యువత ఫిదా అవుతున్నార‌ని అనుకున్న ప‌వ‌న్‌.. 2019లో హ‌డావుడి చేసి.. పోటీ కి దిగారు. తాను ఏకంగా ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌ల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయారు. ఇక‌, ఈ పార్టీత‌ర‌ఫున పోటీ చేసిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌.. రాజోలు నుంచి గెలిచి.. జ‌న‌సేన త‌ర‌ఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా గుర్తింపు పొందారు. పోనీ.. ఈయ‌నైనా నిల‌బ‌డ్డారా? అంటే.. ఆయ‌న జ‌గ‌న్ పంచ‌న చేరిపోయారు.  

పోనీ.. అయిందేదో అయిపోయింది.. పార్టీని నిల‌బెట్టుకుందాం.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిపై పోరాడి.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుందాం.. అని ఆలోచించ‌కుండా.. 2019 ఎన్నిక‌ల్లో ఏ బీజేపీ నైతే తిట్టి పోశారో.. ఆ బీజేపీ చంకే ఎక్కారు ప‌వ‌న్‌. ఇక‌, ఇప్పుడు వారికి స్పాన్స‌ర్ షిప్ చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీ రాజ‌కీయాల్లో ఎప్పుడూ క‌ష్ట‌ప‌డ‌దు.. ఎవ‌రో రావాలి.. వారు ఆర్థికంగా వ‌న‌రులు అందించాలి. కానీ, తాము మాత్రం లాభ‌ప‌డాలి! అనే ధోర‌ణిలోనే ఉంటుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపించింది.

ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి? అంటే.. సినిమాల్లోకి వెళ్లిపోయారు. వాస్త‌వానికి ఆయ‌న చెప్పింది ఏంటి.. ఇక‌, సినిమా జోలికి పోను.. నాకు రాజ‌కీయాలే ముఖ్యం.. ప్ర‌శ్నించ‌డ‌మే లోకం అన్నారు. క‌ట్ చేస్తే... ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారో తెలియ‌దు కానీ.. ఆయ‌న సినిమా మోజులో ప‌డిపోయారు. దీంతో ఇక‌, పూర్తిగా ఆయ‌న రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాప్ పెట్టార‌నే అభిప్రాయం వెలువ‌డుతోంది. క‌ష్ట‌ప‌డ‌కుండానే రాజ‌కీయాల్లో ఎదిగిన నాయ‌కులు ఈ దేశంలో ఎవ‌రూ లేరు.. అనే విష‌యాన్ని మెగా కుటుంబం గ్ర‌హించాల‌ని అంటున్నారు అభిమానులు.. మొత్తానికి ఇప్ప‌టికైతే.. ప‌వ‌న్‌ను ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఆయ‌న రాజ‌కీయంగా చాప్ట‌ర్‌ను క్లోజ్ చేసేశార‌నే అంటున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News