తొందరపడకపోతే పవన్ కు కష్టమేనా ?

Update: 2021-10-01 10:30 GMT
అవును ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్నారు. కాబట్టే ఇప్పుడైనా ముందుజాగ్రత్తపడకపోతే కష్టమే. 2024లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటున్న పవన్ ముందు తమ ఎన్నికల గుర్తును సంపాదించుకుంటే అదే బ్రహ్మాండం. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే  బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఉపఎన్నికలో మిత్రపక్షాల తరపున జనసేన పోటీచేయాలని గట్టిగా కోరుకుంటోంది. బద్వేలులో ఏ పార్టీ పోటీచేయబోతోందనే విషయాన్ని తొందరలోనే డిసైడ్ అవుతుందని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.

అయితే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి తాము సహకరించిన విషయాన్ని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు. పార్లమెంటు ఉపఎన్నికలో తాము పోటీచేయాలని అనుకున్నా కమలంపార్టీ నేతల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా తమ అధినేత పవన్ కల్యాణ్ వెనక్కు తగ్గినట్లు చెప్పారు. కాబట్టి ఈ ఉపఎన్నికలో పోటీచేసే అవకాశం తమకే దక్కుతుందని జనసేన నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

సరే రెండుపార్టీల మధ్య సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి, ఎవరు పోటీచేయాలనే విషయం ఎప్పుడు డిసైడ్ అవుతుంది అని మాత్రం చెప్పలేకున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అదేమిటంటే పవన్ గనుక తొందరపడకపోతే మళ్ళీ తన పార్టీ గుర్తుగా చెప్పుకుంటున్న గాజుగ్లాసు మళ్ళీ వాళ్ళ నుండి చేజారిపోవడం ఖాయం. ఇప్పటికే ఒకసారి ఎన్నికల గుర్తుపై దెబ్బతిన్నారు.

తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధికి కేంద్ర ఎన్నికల కమీషన్ గాజుగ్లాసు గుర్తును కేటాయించింది. తమపార్టీ ఎన్నికల గుర్తును ఇండిపెండెంట్ కు కేటాయించటాన్ని పవన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే పవన్ అభ్యంతరాన్ని కమీషన్ కొట్టేసింది. జనసేన అన్నది రిజిస్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు. ఓ పార్టీకి రికగ్నిషన్ రావాలంటే ఓట్లు, సీట్ల విషయంలో చాలా లెక్కలుంటాయి.

అవేవీ లేని జనసేనను కమిషన్ రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించలేదు. రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు లేకపోతే స్థిరమైన సింబల్ ఉండదు. ఈ మధ్యనే ఈ విషయాన్ని ఎన్నికల కమీషన్ ప్రకటించింది కూడా. జనసేన చెప్పుకుంటున్న గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. అంటే జనసేన అభ్యర్థి కన్నా ముందే ఎవరైనా నామినేషన్ వేసి గాజు గ్లాసు గుర్తు కావాలంటే కమీషన్ కేటాయించేస్తుంది.

అప్పుడు జనసేన ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నామని కలలుకంటున్న పవన్ ముందు బద్వేలు ఉపఎన్నికలో గాజు గ్లాసు గుర్తును తమ అభ్యర్థికి ఇపించుకోగలిగితే అదే పదివేలు. కాబట్టి ఇఫుడు ఈ విషయంలో తొందరపడకపోతే రెండోసారి కూడా పవన్ కు గాజగ్లాసు గుర్తు విషయంలో అవమానం తప్పదని గుర్తుంచుకోవాలి
Tags:    

Similar News