పవన్ ఏ రోటికాడ ఆ పాట

Update: 2018-01-22 17:14 GMT
పవన్‌ కు రాజకీయ అనుభవం లేదని అంతా అంటున్నారు కానీ - ఆయన అనుభవం ముందు మహా మహా నేతలే చిన్నబోవాల్సి ఉంటుందన్న మాట తాజాగా వినిపిస్తోంది. అవును.. ఏ రోటికాడ ఆ పాట పాడుతూ పవన్ చేస్తున్న రాజకీయం చూస్తున్నవారంతా ఇదే మాట అంటున్నారు. ఇంతకాలం చంద్రబాబు భజన చేసిన పవన్ ఇప్పుడు తెలంగాణలో యాత్ర మొదలుపెట్టి కేసీఆర్ భజన ప్రారంభించడమే కాకుండా చంద్రబాబు తప్పుల గురించి కూడా మాట్లాడుతుండడం... ఏపీలో ఉన్నప్పుడు విభజన వల్ల కలిగిన నష్టాల గురించి మాట్లాడే ఆయన తెలంగాణలో ఇప్పుడు ప్రత్యేక రాష్ర్ట సాధన అంటూ గొంతు మార్చడంతో పవన్ ఏ రోటికాడ ఆ పాట పాడే నాయకుడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
    
ఈ రోజు పూర్వ కరీంనగర్ జిల్లాలో ఉన్న పవన్ కేసీఆర్ తో తన భేటీ గురించి మాట్టాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్ తాట తీస్తానని పవన్ అన్న విసయాన్ని విలేకరులు గుర్తు చేయగా.. అదంతా గతమంటూ - ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెబితే తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని.. అందుకే ప్రజలు ఆయనకు పట్టం కట్టారని అన్నారు. తెలంగాణ తీసుకురావడంతో కేసీఆర్‌ ను ప్రజలు నమ్మారని పవన్ అన్నారు.
    
అలాగే,  ఓటుకు నోటు కేసు వ‌చ్చిన‌ప్పుడు తాను స్పందించ‌కపోవడం గురించి ఆయన మాట్లాడారు. ఆ పని(చంద్రబాబు చేసింది) త‌ప్పు అని త‌న‌కు తెలుస‌ని, కానీ బాధ్య‌త‌తో మాట్లాడాలి కాబట్టి మౌనంగా ఉన్నానని అన్నారు. అప్పటికే ఆ విషయంపై అన్ని పార్టీలు విమ‌ర్శ‌లు చేశాయ‌ని, తానొక మాట అని స‌మ‌స్య‌పై మ‌రింత ర‌చ్చ చేయ‌కుండా ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలని ఆలోచించాన‌ని పవన్ తెలిపారు. అందుకే ఆ విష‌యంపై స్పందించ‌లేదని చెప్పుకొచ్చారు. రాజ‌కీయ‌ప‌రంగా ఎవ్వ‌రికీ ల‌బ్ది చేకూర్చే ప‌నులు తాను చేయ‌నని అన్నారు.

Tags:    

Similar News