వాళ్ల మీద కేసు పెడతానంటున్న పవన్ పరివారం

Update: 2019-09-03 07:03 GMT
ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలంటూ రెండు పడవల మీద ప్రయాణం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అలా చేస్తే ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారని చెప్పాలి. ఈ కారణంతోనే పార్టీ పెట్టిన ఐదేళ్లకు సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. పూర్తిగా రాజకీయాలకే తాను పరిమితం కానున్నట్లు ప్రకటించారు. జనసేన పెట్టిన తర్వాత కూడా అడపా దడపా సినిమాలు చేసిన పవన్.. 2018 జనవరిలో అజ్ఞాతవాసి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమాల పరంగా చూస్తే.. అదే తన ఆఖరి చిత్రంగా ఆయన పేర్కొన్నారు.

ఆ తర్వాత నుంచి పూర్తిస్థాయి రాజకీయాలకే పరిమితమైనా.. ఆయన అప్పుడు నటిస్తారు.. ఇప్పుడు నటిస్తారన్న మాట తరచూ వినిపిస్తూ ఉండేది. తనకు సినిమాలు చేయాలన్న ఆలోచన లేదన్న మాటను ఆయన చెప్పేవారు. దీనికి తగ్గట్లే.. గడిచిన ఏడాదిన్నరగా సినిమా వైపు చూడలేదని చెప్పాలి. ఎవరైనా సినిమాల్లో నటించాలని చెప్పినా.. సున్నితంగా రిజెక్ట్ చేయటం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే..తాజాగా పవన్ పేరు మీద ఒక లేఖ వైరల్ గా మారింది. పవన్ త్వరలో సినిమాలు చేస్తారన్నది ఆ లేఖ సారాంశం. పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రచారంలోకి వచ్చిన ఈ లేఖ విషయంపై పవన్ అండ్ కో సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తారన్న చెప్పటం ద్వారా ఆయన అభిమానుల్లో.. పార్టీ వర్గాల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం కోసమేనన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలతో రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను దెబ్బ తీసే కుట్రలో భాగంగానే తాజా ప్రచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండి పని చేస్తున్న పవన్ మీద తప్పుడు ప్రచారం ద్వారా ఆయన ఇమేజ్ ను దెబ్బ తీయటమే తాజా లేఖ ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ కారణంతోనే.. తప్పుడు లేఖల్ని ప్రచారం లోకి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటివి రానున్న రోజుల్లో మరిన్ని తెర మీదకు రాకుండా చేయటానికి.. లేఖ తయారు చేసిన వారిని.. ప్రచారం చేస్తున్న వారిపైనా కేసులు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరీ.. కేసుల వ్యవహారం ఎటువైపునకు వెళుతుందో చూడాలి.


Tags:    

Similar News