పాదయాత్ర చేయాలని ఉందన్న పవన్

Update: 2016-11-11 05:44 GMT
జనసేన అధినేత మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను దిగనున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్ తాజాగా మరో ఆసక్తికర మాటను చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న ఆయన.. శుక్రవారం ఉదయం గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.

వేలాదిగా హాజరైన కాలేజీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పవన్ ను.. పలువురు అనంతపురం జిల్లా కరవు గురించి.. సీమ వెనకుబాటు గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కరవు గురించి తాను మాట్లాడనని.. తనకు పాదయాత్ర చేయాలన్న ఆలోచన ఉందని ప్రకటించారు. ఇప్పటికే తాను పాదయాత్ర చేయాలని భావించినా.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో తాను పాదయాత్ర చేయలేదన్న ఆయన.. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

అనంతపురంలోని కరవు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర చేసిన తర్వాత.. కరవుపై తాను మాట్లాడతానని చెప్పారు. కరవు ప్రాంతాల్లో మూడు రోజులు పాదయాత్ర చేసిన తర్వాత తనను ఈ అంశంపై ప్రశ్నలు వేసిన ముగ్గురు అమ్మాయిలకు తాను సమాదానం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పిన పవన్.. తాజాగా తనకు పాదయాత్ర చేయాలని ఉన్నట్లుగా చెప్పటం ద్వారా ఇకపై తన రాజకీయ నిర్ణయాలు మహా దూకుడుగా ఉంటాయన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News