పీకేకు 'ఎక్స్‌ లెన్స్‌' వ‌చ్చేసింది!

Update: 2017-11-17 17:09 GMT
ప్ర‌ముఖ సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇండియా, యూరోపియ‌న్ బిజినెస్ ఫోరం (ఐఈబీఎఫ్‌) ప్ర‌క‌టించిన *గ్లోబ‌ల్ ఎక్స్‌లెన్స్ అవార్డు*ను అందుకున్నారు. ఏపీలోని శ్రీ‌కాకుళం జిల్లా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల మూలాల‌ను గుర్తించాల‌ని, ఆ వ్యాధుల బారి నుంచి ఆ జిల్లా ప్ర‌జ‌ల‌ను విముక్తుల‌ను చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను సూచించాల‌ని గ‌తంలో ప‌వ‌న్ బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌ల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. ఓ సినీ స్టార్ గా ఉండి... ఓ వ్యాధి బారిన ప‌డిన ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌వ‌న్ ప‌డుతున్న త‌ప‌న‌ను గుర్తించిన బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు ఇదివ‌ర‌కే శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్ చూపిస్తున్న ప్ర‌త్యేక చొర‌వ‌ను గుర్తించిన ఇండియా, యూరోపియ‌న్ బిజినెస్ ఫోరం (ఐఈబీఎఫ్‌) ఆయ‌న‌కు *గ్లోబ‌ల్ ఎక్స్‌ లెన్స్ అవార్డు*ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ అవార్డును అందుకోవ‌డానికి రావాలంటూ గ‌తంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఐఈబీఎఫ్ నుంచి ఆహ్వానం అందిన విష‌యం కూడా తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ అవార్డును అందుకోవ‌డంతో పాటుగా అక్క‌డి ప‌లు యూనివ‌ర్సిటీల‌కు చెందిన విద్యార్థుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యేందుకు ప‌వ‌న్ ఇప్ప‌టికే లండ‌న్‌లో ల్యాండ్ అయిన విష‌యం కూడా విదిత‌మే. కాసేప‌టి క్రితం బ్రిట‌న్ పార్ల‌మెంట్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌ లో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అవార్డును అందుకున్నారు.

ఇదిలా ఉండ‌గా... రేపు ప‌వ‌న్ మ‌రొ కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. బ్రిట‌న్‌ కు చెందిన ప‌లు విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థుల‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశాల్లో ప‌వ‌న్ ఏఏ అంశాల‌ను ప్ర‌స్తావిస్తార‌న్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. అంతేకాకుండా... ఆయా వ‌ర్సిటీలో ఉన్న తెలుగు విద్యార్థులే ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతారా?  లేదంటే ప్రాంతంతో సంబంధం లేకుండా ఆస‌క్తి ఉన్న అంద‌రు విద్యార్థుల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మ‌వుతారా? అన్న విష‌యం తేలాల్సి ఉంది. మొత్తానికి బ్రిట‌న్ పార్ల‌మెంటులో ఏర్పాటు చేసిన వేదిక మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ అవార్డు అందుకోవ‌డం నిజంగానే అద్భుతంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News