4 వారాల క్రితం జ‌రిగింది చెప్పిన ప‌వ‌న్‌

Update: 2017-03-27 06:34 GMT
రాజకీయ విభేదాల కార‌ణంగా వేర్వేరు పార్టీల వారు తిట్టుకోవ‌టం మామూలే. కొన్నిసార్లు హ‌ద్దులు దాటి.. అంత‌కు మించి కొట్టుకోవ‌టాలు.. వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకోవ‌టాలు జ‌రిగిపోతుంటాయి. కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఇంత ర‌చ్చ న‌డుస్తున్నా.. నేత‌ల మ‌ధ్య అలాంటి వాతావ‌ర‌ణం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అసెంబ్లీ స‌మావేశాల్ని టీవీల్లో చూసే వారికి బీపీ పెరుగుతుంది. కానీ.. టీవీల్లో క‌నిపించే దాని  త‌ర్వాతేం జ‌రుగుతుంద‌న్న‌ది మీడియాకు.. మ‌రికొంద‌రికి మాత్ర‌మే క‌నిపిస్తుంటుంది. ఏదైనా విషయాల మీద పోటాపోటీగా విమ‌ర్శ‌లు చేసుకున్నా.. అసెంబ్లీ గ‌ది దాటి బ‌య‌ట‌కు రాగానే.. నేత‌లు మామూలుగా మాట్లాడుకోవ‌టం చాలా చాలా కామ‌న్‌.

రాజ‌కీయ నాయ‌కులే కాదు.. సినిమా సెల‌బ్రిటీలు కూడా దాదాపు అలానే ఉంటారు. మా హీరో తోపు.. మా హీరో మొనగాడంటూ వేలాది గంట‌లు చ‌ర్చ‌లు చేసేసి.. తాము అభిమానించే క‌థానాయకుడు ఎంత గొప్పొడో నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు సామాన్య‌జీవి. కానీ.. వీటికి అతీతంగా ఉంటారు స‌ద‌రు సినీ హీరోలు. అభిమానుల మ‌ధ్య బేధాభిప్రాయ‌లే కానీ.. హీరోల మ‌ధ్య అలాంటివి చాలా త‌క్కువ‌గా ఉంటాయి.

చ‌ర్మం ఒలుస్తా లాంటి క‌ఠిన‌మైన మాట‌ల్ని అల‌వోక‌గా వాడేసే స‌త్తా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ దే. చాలా ఆచితూచి మాట్లాడ‌టం త‌న‌కు అల‌వాట‌ని.. త‌న నోటి నుంచి ఏదైనా మాట వ‌చ్చే ముందు తాను చాలా ఆలోచిస్తాన‌ని చాలానే మాట‌లు చెబుతుంటారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

మ‌రి.. అలాంటి వ్య‌క్తి నోటి నుంచే పంచెలు ఊడ‌దీసి కొడ‌తా.. చ‌ర్మం ఒలిచేస్తా లాంటి మాట‌లు వ‌చ్చేస్తుంటాయి.

ప‌వ‌న్ ముచ్చ‌ట‌ను కాసేపు ప‌క్క‌న పెడితే.. నోరు తెరిస్తే ఆంధ్రోళ్లు.. ఆంధ్రా ప్రాంతం వారంటూ విరుచుకుప‌డే మంత్రి కేటీఆర్ ఉద్య‌మ స‌మ‌యంలో ఎంత హాట్ హాట్ గా మాట్లాడ‌తారో తెలిసిందే.అసెంబ్లీ భ‌వ‌నం ద‌గ్గ‌ర లోక్ స‌త్తా అధినేత జేపీతో త‌న పార్టీ వారు అనుచితంగా వ్య‌వ‌హ‌రిస్తే.. చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారే కానీ ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు కేటీఆర్ పై వినిపిస్తుంటాయి.

మ‌రి.. ఇలాంటి ఉత్త‌ర‌ద‌క్షిణ ధ్రువాల్లాంటి నేత‌లు ఇద్ద‌రు ప్రైవేటుగా క‌లుస్తార‌ని ఊహించ‌గ‌ల‌మా? అంటే లేద‌నే చెప్పాలి. కానీ.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఆ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాట‌మ‌రాయుడి సినిమాను చూశాన‌ని.. బాగుందంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌ లో ట్వీట్ చేసి మ‌రీ అభినందిస్తే.. అది జ‌రిగిన కాసేప‌టికి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం రియాక్ట్ అయ్యారు. నాలుగు వారాల క్రితం తాను.. మంత్రి కేటీఆర్ క‌లిశామ‌ని.. త‌మ మ‌ధ్య చ‌క్క‌టి మీటింగ్ జ‌రిగింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇద్ద‌రూ క‌ల‌వాల‌ని చాలామార్లు అనుకున్నా.. ఎవ‌రికి వారికి ఉన్న బిజీ షెడ్యూల్ కార‌ణంగా కుద‌ర్లేద‌ని.. చివ‌ర‌కు క‌లిశామ‌ని.. రాజ‌కీయంగా ఒక‌రి అభిప్రాయాల్ని మ‌రొక‌రం షేర్ చేసుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు. రాజ‌కీయ అంశాలే కాదు.. కామ‌న్ ఇంట్ర‌స్ట్ లు.. చేనేత కార్మికుల మీద ఉన్న అభిప్రాయాల్ని షేర్ చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. ఎవ‌రి కోస‌మైతే.. చొక్కాలు చింపుకుంటామో.. వాళ్లంతా పైన బాగానే ఉంటారు. కానీ.. త‌ర‌చూ చినిగేది మాత్రం సామాన్యుడి చొక్కాలు మాత్ర‌మేన‌ని. సో.. ఇప్ప‌టికే ప్ర‌తి చిన్న దానికి చెల‌రేగిపోకుండా.. కాస్తంత స్థిమితంగా ఆలోచిస్తే మంచిదేమో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News