పద్మాలు ఎవ‌రికివ్వాలో చెప్పిన ప‌వ‌న్‌

Update: 2018-01-26 10:27 GMT
ద‌క్షిణాది వారంటే ఉత్త‌రాది వారికి చిన్న‌చూపా? గ‌తంలో ఈ త‌ర‌హా ప్ర‌శ్న వేయాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సి వ‌చ్చేది. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. పాల‌కుల పుణ్య‌మా అని.. ప‌లువురు నేత‌లు అదే ప‌నిగా ఈ మాట‌ను అల‌వోక‌గా అనేస్తున్నారు. గ‌తంలో సామాన్యుల మాటల్లో వినిపించే మాట‌లు.. ఇప్పుడు నేత‌ల నోటి నుంచి అది కూడా ప్ర‌ముఖంగా వ‌స్తున్నాయి.

నిజానికి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు మొగ్గ‌లోనే తుంచేయాల్సిన బాధ్య‌త కేంద్రానికి ఉంటుంది. అలా కాకుండా ఈ త‌ర‌హా భావ‌న‌లు అశేష ప్ర‌జానీకం మ‌న‌సుల్లో రిజిష్ట‌ర్ అయితే.. దీర్ఘ‌కాలంలో దేశ స‌మ‌గ్ర‌త‌కే ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఉత్త‌రాది..ద‌క్షిణాది లాంటి కొల‌త‌లు వేసుకునే అవ‌కాశం ఉన్న ప్ర‌తి విష‌యంలోనూ అలెర్ట్ గా ఉంటూ.. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది.

దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆ విష‌యాన్ని కేంద్రంలోని మోడీ స‌ర్కారు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. నేత‌ల నోట్లో నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని విన‌న‌ట్లుగా ఉంటున్నారు. అలా వ్య‌వ‌హ‌రించ‌టం వ్యూహాత్మ‌క‌మైతే ఫ‌ర్లేదు. పైకి మౌనంగా ఉన్నా.. కొన్ని నిర్ణ‌యాలు తీసుకునే వేళ‌లో.. మ‌ళ్లీ ఆ త‌రహా విమ‌ర్శ‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌గా ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అలాంటివేమీ మోడీ స‌ర్కారుకు ప‌ట్ట‌న‌ట్లుగా ఉంది.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించే ప‌ద్మాల విష‌యంలో తెలుగువారు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు. తెలుగు నేల మీద ప‌ద్మ పుర‌స్కారాల‌కు అర్హులైన వారు పెద్ద సంఖ్య‌లో ఉన్నా.. ఏపీకి చెందిన ఒక్క‌రిని.. తెలంగాణ‌కు చెందిన ఎవ‌రిని ఎంపిక చేయ‌క‌పోవ‌టంపై నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ స‌ర్కారు ప‌ద్మ పుర‌స్కారాల కోసం కేంద్రానికి పంపిన జాబితాను ప‌క్క‌న పెట్టేసి.. ఎవ‌రికీ ప‌ద్మ పుర‌స్కారానికి ఎంపిక చేయ‌క‌పోవ‌టం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల పేర్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం పంపింది. అయినా.. ఒక్క‌రికి కూడా పుర‌స్కారానికి ప్ర‌క‌టించ‌క‌పోవ‌టం వివాదంగా మారింది.

ఇలాంటి వేళ‌.. ఈ వ్య‌వ‌హారంపైన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను మీడియాప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. ప‌ద్మ పుర‌స్కారాల మీద స్పందించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన ఆయ‌న‌.. తెలుగువారిలో మ‌రికొంద‌రికి అవార్డులు ఇస్తే బాగుండేద‌న్నారు. సావిత్రి.. ఎస్వీ రంగారావుకు ప‌ద్మ అవార్డులు ద‌క్కేలా కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌న్నారు. మ‌రి.. ప‌వ‌న్ మాట‌ను రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు ఎంత‌మేర పాటిస్తాయో?


Tags:    

Similar News