గంగ ఎపిసోడ్లో స్వామికి ప‌వ‌న్ స‌పోర్ట్!

Update: 2018-08-09 06:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాను జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ట్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పినా.. ఆయ‌న దృష్టి మొత్తం ఏపీ మీద‌నే అన్న విష‌యం తెలిసిందే. పేరుకు రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉన్నా.. త‌న ఫోక‌స్ అంతా ఏపీ మీద పెట్టిన ప‌వ‌న్‌.. తాజాగా త‌న ఇమేజ్ ను మ‌రింత పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఆ మ‌ధ్య‌న ఉద్దాణం కిడ్నీ స‌మ‌స్య‌ను తెర మీద‌కు తెచ్చిన ప‌వ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ పాల‌కులు ఎవ‌రూ తాను పెట్టినంత శ్ర‌ద్ధ ఈ అంశం మీద పెట్ట‌లేద‌న్న ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం చేసిన ఆయ‌న‌.. తాజాగా మ‌రో సామాజిక అంశాన్ని తీసుకోవ‌టం విశేషం.

అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధం లేని అంశంపై ప‌వ‌న్ త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించి జాతీయ స్థాయిలో త‌న పేరు వ‌చ్చేలా చేసుకోవ‌టం క‌నిపిస్తోంది. గంగ ప‌రిర‌క్ష‌ణ గురించి మోడీ గ‌తంలో త‌ర‌చూ మాట్లాడేవారు.  ప్ర‌ధాని రేసులో ఉన్న వేళ మోడీ నోటి నుంచి త‌ర‌చూ వినిపించిన గంగ ప్ర‌క్షాళ‌న.. త‌ర్వాత రోజుల్లో రాక‌పోవ‌టం తెలిసిందే.

కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న గంగాన‌దితో ప‌ర్యావ‌ర‌ణానికే కాదు.. ప‌లు వ్యాధుల‌కు కార‌ణం అవుతుంద‌న్న అంశంపై  ప్రొఫెస‌ర్ జీడీ అగ‌ర్వాల్ అలియాన్ స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్ కొంత‌కాలంగా ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును స‌నంద్‌ కు ప్ర‌క‌టించారు.

గంగ ప్ర‌స్తుత దుస్థితికి మోడీ స‌ర్కార్ కార‌ణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు పార్ల‌మెంటులో ఒక చ‌ట్టాన్ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ప‌వ‌న్‌.. గంగ ఇష్యూలో తన గ‌ళాన్ని వినిపించ‌టం ద్వారా జాతీయ స్థాయి ఇమేజ్ మీద దృష్టి పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News