ఢిల్లీలో జనసేనాని..అంతా సీక్రెట్ మీటింగులేనా?

Update: 2019-11-17 16:12 GMT
జనసేనాని ఢిల్లీ పర్యటన నిజంగానే ఆసక్తికరంగా మారిపోయింది. ఏపీలో వైసీపీ సర్కారుపై తనదైన శైలి నిరసనను వ్యక్తం చేస్తున్న పవన్... సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన విషయం ఒకింత ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా ఢిల్లీలో పవన్ ల్యాండ్ కాగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అవుతారని - వీలును బట్టి ప్రధాని నరేంద్ర మోదీతోనూ పవన్ భేటీ అవుతారని వార్తలు వినిపించాయి. అదే టెంపోతోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్... ఇప్పటిదాకా తాను ఎవరెవరిని కలిశాను? అన్న వివరాలపై అసలు మాటమాత్రంగా కూడా మాట్లాడలేదు.

ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ పర్యటనలో పవన్ ఏం చేస్తున్నారన్న అంశం ఆసక్తి రేకెత్తించింది. అయినా పవన్ ఢిల్లీలో ల్యాండయ్యారా? లేదంటే ఆయన అసలు ఢిల్లీ గడపే తొక్కలేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవన్ అసలు ఢిల్లీ గడపే తొక్కలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకు ఢిల్లీ పర్యటనే అయినా... పవన్ ఢిల్లీ అవుట్ స్కట్స్ లోని నోయిడాలో మకాం వేశారని - నోయిడా పరిధిలోని ఓ హోటల్ లోనే బస చేశారని తెలుస్తోంది. జనసేన ప్రకటన కూడా పవన్ ఢిల్లీ పర్యటన.. పూర్తిగా వ్యక్తిగతమేనని - ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు పవన్ అక్కడికి వెళ్లారని చెప్పని సంగతి తెలిసిందే.

అయితే పవన్ హాజరవ్వాల్సిన ప్రైవేట్ కార్యక్రమం ఇప్పటికే పూర్తి అయినా కూడా పవన్ ఇంకా అక్కడే ఎందుకు ఉన్నారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలో పవన్ కు ఇప్పటిదాకా అమిత్ షా గానీ - మోదీ గానీ - ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లేవీ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి అపాయింట్ మెంట్ల కోసమే నోయిడాలో వెయిట్ చేస్తున్న పవన్... ఢిల్లీకి దూరంగానే ఉంటున్నారట. అంతేకాకుండా తాను ఎవరెవరిని కలిశాను? అన్న విషయాలు బయటకు పొక్కకుండా ఉండేలా కూడా పవన్ నోయిడాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా బీజేపీకి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలను ఆయన నోయిడాకే రప్పించుకుని కలిసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా ఓ పార్టీ అధినేతగా ఉన్న పవన్... ఢిల్లీ పర్యటన పేరు చెప్పి నోయిడాలో మకాం వేసి బీజేపీకి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలను కలిసినట్లుగా వినిపిస్తున్న వార్తలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి పవన్ ఢిల్లీ టూర్ వివరాలు ఎప్పుడు విడుదలవుతాయో చూడాలి.


Tags:    

Similar News