ప్రత్యేక హోదా మీద పవన్ అలా డిసైడ్ అయ్యారా?

Update: 2016-05-17 06:40 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రసర్కారు అనుసరిస్తున్న తాజా వైఖరి పట్ల జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తాను స్వయంగా బయటకు వచ్చి.. తన ఇమేజ్ ను పణంగా పెట్టి.. ఏపీకి అన్నివిధాలుగా మోడీ సాయం చేస్తారని చెప్పిన తర్వాత.. ఈ రోజు మోడీ పరివారం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పటం అంటే.. తాను చెప్పిన మాట అబద్ధమైందన్నట్లుగా పవన్ ఆందోళన చెందటమే కాదు.. ఇది తన విశ్వసనీయతను దెబ్బ తీసే పరిణామంగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. ఏపీని ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ మోడీ సర్కారు సానుకూలంగా లేకపోవటం.. ఈ విషయాన్ని కేంద్రానికి చెందిన మంత్రులు.. పలువురు బీజేపీ నేతలు చాలా క్యాజువల్ గా చెప్పేయటంపై పవన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న అంశంపై పవన్ అండ్ కో తీవ్రస్థాయిలో సమాచాలోచనలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మోడీ మీద వార్ ప్రకటించినా.. అది తొందరపాటు అవుతుందని.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండటం.. కేంద్రంలో బలంగా ఉన్న మోడీని వ్యతిరేకించటం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న భావనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.

మోడీ సర్కారు తీరు పట్ల ఏపీ అధికారపక్షంగా టీడీపీ ఎలా వ్యవహరిస్తుందన్న విషయం మీద దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఏపీ ప్రయోజనాల పరిరక్షణకు ఏపీ అధికారపక్షంగా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారన్న విషయంపై ఫోకస్ పెట్టటం ఒక వ్యూహమైతే.. కేంద్రం తీరు మీద తమ పార్టీ కార్యకర్తలతో నిరసనలు చేపట్టే అంశం మీద కూడా దృష్టి పెట్టినట్లు చెబతున్నారు. ఈ నిరసనలకు ప్రజా స్పందన ఎలా ఉందన్న విషయాన్ని చెక్ చేసుకోవటం.. దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆచితూచి అడుగు వేయాలన్న ఉద్దేశంలో ఉన్న పవన్ కల్యాణ్.. అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఏదైనా పెద్ద ఘటన చోటు చేసుకున్నా.. పరిణామం ఏర్పడినా సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించే పవన్ ఈసారి అందుకు భిన్నంగా కామ్ గా ఉండటం గమనార్హం. ప్రత్యేక హోదా మీద మోడీ సర్కారు తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాత కూడా పవన్ స్పందించకపోవటం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. ఇప్పటికైతే పవన్ ఈ విషయం మీద ఏమీ మాట్లాడకూడదని.. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకహోదా మీద కేంద్రం మరిన్ని తప్పులు చేసే వరకూ వెయిట్ చేసి.. ఒక్కసారి గళం విప్పాలని.. అప్పటివరకూ వేచి చూడటమే విధానంగా పెట్టుకోవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. 
Tags:    

Similar News