కాంగ్రెస్ స‌భ‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు

Update: 2017-06-04 08:13 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌త్యేక హోదా పోరు ఉధృతం అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన అధికారంలో వ‌చ్చిన బీజేపీ - టీడీపీల‌కు వ్య‌తిరేకంగా స్పెష‌ల్ స్టేట‌స్ కోసం ఉద్య‌మిస్తున్న పార్టీల‌కు మ‌ద్ద‌తు పెరుగుతున్న‌ట్లు ప‌రిణామాలు మారుతున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చారు. ఈ  స‌భ‌కు ప‌వ‌న్ ట్వీట్ ద్వారా మ‌ద్ద‌తిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఈ స‌భ‌కు హాజ‌రు కానున్న సంగ‌తి తెలిసిందే.

ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న ఏపీపీసీసీ అధ్య‌క్షుడు రఘువీరారెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాన‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని సూచించారు. బహిరంగ సభల ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని పవన్‌ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీకి మా మద్దతు ఉంటుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌  ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. స్వ‌ల్ప స‌మ‌యంలో త‌న దృష్టికి రాక‌పోవ‌డంతో స‌భ‌కు రాలేక‌పోయిన‌ట్లు వివ‌రించారు.

కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అధికార తెలుగుదేశం పార్టీకి ఝ‌ల‌క్ అని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మ‌ని భావిస్తుండ‌గా ఆయ‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌ స్పెష‌ల్ స్టేట‌స్ పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News