ప‌రిటాల ఇష్యూ అస‌లు క‌థ చెప్పిన ప‌వ‌న్‌

Update: 2017-12-08 10:20 GMT
గ‌డిచిన మూడు రోజులుగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉద‌యం వివిధ స‌మ‌స్య‌ల మీద పోరాడుతున్న వారిని క‌లిసి.. వారి స‌మ‌స్య‌ల్ని విన్న ప‌వ‌న్‌.. గ‌డిచిన రెండు రోజుల మాదిరే మ‌ధ్యాహ్నం అయ్యేస‌రికి పార్టీ ఔత్సాహికుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎప్పుడు లేని రీతిలో ఆయ‌న కొత్త విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త‌న గురించి ప్ర‌చారం జరిగిన ఒక అపొహ‌పై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.అప్ప‌ట్లో ఒక భూవివాదం విష‌యంలో ప‌వ‌న్‌ను తీసుకెళ్లిన ప‌రిటాల ర‌వి కొట్టార‌ని.. గుండు కొట్టించారంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. తాను త‌మ్ముడు చిత్ర షూటింగ్ లో భాగంగా బీహెచ్ ఈఎల్‌లో ఉన్నాన‌ని.. అప్పుడు త‌న సోద‌రుడు నాగ‌బాబు ఫోన్ చేసిన ఎక్క‌డ ఉన్నావ‌ని అడిగార‌ని.. తానున్న షూటింగ్ లొకేష‌న్ గురించి చెప్పాన‌ని.. కాదు.. స‌రిగా చెప్పు ఎక్క‌డ ఉన్నావ‌ని అడిగితే.. తాను నిజ‌మే చెప్పాన‌ని చెప్ప‌గా.. జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి త‌న‌కు తొలిసారి తెలిసింద‌న్నారు.ప‌రిటాల ర‌వితో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. ఈ ప్ర‌చారం తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు చేశార‌ని.. ఆ ప్రచారం నెమ్మ‌దిగా మొద‌లై.. మూడు సంవ‌త్స‌రాల‌కు పేప‌ర్లో వార్త రూపంలో వ‌చ్చే వ‌ర‌కూ వెళ్లింద‌న్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టాల‌న్న దురుద్దేశంతో కొంద‌రు టీడీపీ నేత‌లు ఆ ప‌ని చేశార‌ని.. ఇప్పుడు కూడా వారు అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తార‌న్నారు. త‌న‌కు చిరాకు క‌లిగి గుండు కొట్టించుకుంటే.. దానికి ప‌రిటాల అంటూ ఏదేదో అల్లేశార‌న్నారు.

త‌న‌ను అంత‌గా అవ‌మానించిన పార్టీతో తాను 2014లో ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చానంటే.. త‌న‌కు కులాల‌కు అతీతంగా ఆలోచించ‌ట‌మేన‌ని చెప్పారు. కులాల మ‌ధ్య ఐక్య‌త చాలా అవ‌స‌ర‌మ‌ని.. అది మాట‌ల్లో చెప్ప‌టం కాదు చేత‌ల్లో చేసి చూపించాల‌న్న ఉద్దేశంతోనే తాను 2014లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చాన‌న్నారు. త‌న‌ను ప‌రిటాల ర‌వి ఎప్పుడు క‌ల‌వ‌లేద‌న్న విషయాన్ని ఆయన ఆత్మ‌క‌థ రాసిన పుస్త‌కంలో కూడా పేర్కొన్నారన్నారు. ప్ర‌ముఖ వ్య‌క్తుల పేరిట లేనిపోని అపోహ‌లు పెంచి వారి అభిమానుల మ‌న‌సుల్ని గాయ‌ప‌ర్చాల‌నుకుంటార‌ని.. అలాంటి వాటి విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. కొద్ది మంది టీడీపీ నేత‌ల స‌ర‌దా కోసం అపోహ‌ల్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేసి ఉండొచ్చ‌ని.. కానీ అలాంటి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. త‌న గురించి చెడుగా ప్ర‌చారం చేసిన పార్టీతో తాను క‌ల‌వ‌టానికి కార‌ణం..మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి కార‌ణం.. ఆపార్టీకి చెందిన కొంద‌రు త‌ప్పులు త‌ప్పించి.. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు.

వ‌ర‌ల్డ్  క్లాస్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఎద‌గాలంటే కులాలు మ‌తాల గురించి ప‌ట్ట‌ని స‌మాజం ఉండాల‌న్నారు. విజ‌య‌వాడ‌.. గుంటూరుల‌లో ఇంకా కుల‌పిచ్చి త‌గ్గ‌లేద‌ని.. అదే జ‌రిగితే వ‌ర‌ల్డ్ క్లాస్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మార‌లేద‌న్నారు. వంగవీటి రంగా గురించి మాట్లాడ‌కుండా విజ‌య‌వాడ పాలిటిక్స్ గురించి తాను మాట్లాడ‌న‌ని చెప్పారు. విజయవాడ కుల రాజకీయాల గురించి తనకు అవ‌గాహ‌న ఉంద‌ని, ఒక‌వేళ వంగవీటి రంగా తప్పు చేసి ఉంటే చ‌ట్ట ప్ర‌కారం శిక్ష ప‌డేలా చేసి ఉండాల్సింద‌ని, కానీ నిరాయుధుడుగా ఉన్న ఆయనను చంపడం పెద్ద తప్ప‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. రంగా హత్య తర్వాత జ‌రిగిన‌ విధ్వంసం కూడా తప్పేన‌ని అన్నారు. తెలంగాణ‌లో కులపిచ్చి ఉండ‌ద‌ని.. అక్క‌డ తెలంగాణ అన్న అభిమానం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. నీ కులం ఏమిటంటూ ప్ర‌శ్నించే ప‌ద్ద‌తి మంచిది కాద‌ని.. కులాల‌కు అతీతంగా ఆలోచించే మైండ్ సెట్ చాలామంచిద‌న్నారు. త‌న కొడుకును ఎవ‌రైనా నీ కులం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తే.. అలాంటి చోట త‌న కొడుకును చ‌దివించ‌న‌న్నారు. కులాల‌కు.. మ‌తాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీగా అమ‌రావ‌తి మార‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దని.. కుల భావ‌న‌ల్ని ఏపీ ప్ర‌జ‌లు మ‌ర్చిపోవాల‌న్నారు.  కులాల మ‌ధ్య ఐక్య‌త ఉన్న‌ప్పుడు నిజ‌మైన అభివృద్ధి జ‌రుగుతుంద‌ని.. లేనిప‌క్షంలో అది సాధ్యం కాద‌న్నారు.
Tags:    

Similar News