తెలంగాణలో దిశ ఘటన..ఏపీలో జగన్ కు పీకే డిమాండ్!

Update: 2019-12-02 17:39 GMT
రేపిస్టులకు వేయాల్సిన శిక్షలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్ చేశారు. సింగపూర్ లో రేపిస్టులకు అమలు చేస్తున్న శిక్షలను ఇక్కడ కూడా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సింగపూర్ తరహా శిక్షలతోనే మన నేలలో అకృత్యాలకు పాల్పడే వారికి భయం పుడుతుందని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణలో చోటుచేసుకున్న దిశ ఘటనపై తనదైన శైలిలో స్పందించిన పవన్... ఏపీలో ఇదే తరహాలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేస్తూ... సదరు కేసులో చర్యలు తీసుకోరా? అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు.

ఈ సందర్భంగా పీకే ఏమన్నారన్న విషయానికి వస్తే.. ఆడబిడ్డల మానప్రాణాలను సంరక్షించు కోలేకపోతే.. 151 సీట్లు ఇచ్చి ప్రయోజనమేంటని వైసీపీ నేతలను పవన్‌ ప్రశ్నించారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్.. ఏదైనా తేడా చేస్తే చంపేస్తారన్న భయం మృగాళ్లకు లేకపోతే.. ఆడ పిల్లలకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. తప్పు చేస్తే దండించడం అనేది చాలా ముఖ్యమని.. తప్పు చేసిన వారికి సింగపూర్‌ తరహా శిక్షలు ఉండాలన్నారు. సుగాలి ప్రీతి విషయంలో ఆధారాలున్నా.. ఎలాంటి న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు. తానూ ఇద్దరు ఆడబిడ్డల తండ్రినని.. ప్రీతి తల్లి దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యాచారాల విషయంలో కుల, మత, ప్రాంతాల గురించి ఆలోచించకూడదని కూడా పవన్ వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం వరంగల్‌లో యాసిడ్ బాధితురాలు స్వప్నికను చూడ్డానికి వెళ్లానని.. కాలిన గాయాలతో ఉన్న ఆమె.. ఇంకెవరికీ ఇలాంటి కష్టం రాకూడదని తనతో చెప్పిందని నాటి సంగతి గుర్తు చేసకున్నారు. స్వప్నిక చెప్పిన చివరి మాటలు అవేనని కూడా పీకే గుర్తు చేసుకున్నారు. కదలని బత్తాయి చెట్టును నరికేస్తే పెద్ద రభస చేస్తారు కానీ - కదిలే ఆడపిల్లకు అన్యాయం జరిగితే.. మాట్లాడే దమ్ము - ధైర్యం లేని మీరేం నాయకులని ప్రశ్నించారు. మొత్తంగా దిశ ఘటనపై స్పందిస్తూ అదే తరహా కేసులపై ఏం చేస్తున్నారని జగన్ ను పవన్ నిలదీశారు.
Tags:    

Similar News