పవన్ : అమ్మకు అన్నం పెట్టడు గానీ..

Update: 2018-04-04 17:05 GMT
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. చంద్రబాబునాయుడు గురించి పదేపదే ఒక కామెంట్ చేస్తుండే వారు. రకరకాల సందర్భాల్లో చంద్రబాబు చెబుతున్న హామీల గురించి వైఎస్ ప్రస్తావిస్తూ.. ‘అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నమ్మకు పరమాన్నం పెడతాట్ట’ అన్నట్లుగా ఆయన వైఖరి ఉన్నదని ఎద్దేవా చేశేవారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే.. ఆయనకు తననే నమ్ముకుని ఉన్న జనసేన పార్టీని నిలబెట్టడానికి... పార్టీ కార్యవర్గాన్నయినా నియమించడానికి, వ్యవస్థాగత నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన ఖాళీ సమయం మాత్రం లేదు. పొరుగు రాష్ట్రంలో కర్నాటకలో ఒక ఇండిపెండెంటు అభ్యర్థికోసం ప్రచారం చేయడానికి రెండు విడతలుగా పర్యటన చేయడానికి మాత్రం ఖాళీ ఉంది. మరి ఇలా చేస్తోంటే విమర్శలు రాకుండా ఏమవుతుంది.

బలిజ వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్న కర్నాటక చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంటు అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి అనంతపురం జిల్లా బలిజ నాయకుల సహకారంతో.. వారి లీడ్ తో పవన్ కల్యాణ్ ఒప్పుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన గతంలో అనంతపురం జిల్లాలో కరవు యాత్ర చేసినప్పుడే.. బెంగుళూరుకు వెళ్లి.. ఈ వ్యవహారానికి సంబంధించి.. అక్కడి కేవీ కాలేజీ అధినేత నవీన్ కిరణ్ కు పవన్ వరం ప్రసాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి.. ఆయన పర్యటన షెడ్యూలు, ఇతర వ్యవహారాలు అన్నింటినీ అదే రోజు సాయంత్రం బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లోని తాజ్ హోటల్లో ఫైనలైజ్ చేశారని సమాచారం. ఆ ప్రకారం మే మొదటి వారంలోనూ, అవసరమైతే మరోసారి కూడా పవన్ చిక్బల్లాపూర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. నవీన్ కిరణ్ ను గెలిపించడానికి తన వంతు కృషి చేస్తారు.

సొంత రాష్ట్రంలో కేవలం పవన్ నే నమ్ముకుని కొన్ని వేల మంది జనసేనలో చేరుతోంటే.. కనీసం ఇప్పటిదాకా రాష్ట్ర కమిటీ వేయడానికి కూడా ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు పార్టీలోనే అంతర్గతంగా పుష్కలంగా వినిపిస్తున్నాయి. అలాంటిది.. ఆయన పొరుగురాష్ట్రం ప్రచారానికి వెళ్లడం అంటే.. అందులో ఏదో కీలకమైన మతలబు తప్పక ఉండే ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని వ్యవహారాలు తేలిన తర్వాతనే ప్రచారం ఉంటుదని కూడా చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News