ప‌వ‌న్ సంచ‌ల‌నం - యాత్ర‌ను ఆపి నిరాహార దీక్ష‌

Update: 2018-05-23 08:23 GMT
జ‌న‌సేన - టీడీపీ వార్ రోజురోజుకు ముదురుతోంది. మూడో కూట‌మిగా ఎలాగైనా చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న జ‌న‌సేనాధిప‌తి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా నిరాహార దీక్ష‌తో ప‌వ‌న్‌ మీడియా అటెన్ష‌న్ పొందే ప్ర‌య‌త్నం చేశారు.  రాష్ట్ర వ్యాప్త స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా స్పందించ‌కుండా సాధార‌ణ అంశాల‌పై మీడియా దృష్టిని డైవ‌ర్ట్ చేయ‌డానికే ప‌వ‌న్ ఇలా చేస్తున్నారా అని కూడా కొంద‌రు ఆరోప‌ణ‌లు చేసినా ప‌వ‌న్ మాత్రం త‌న యాత్ర‌ను కొన‌సాగిస్తూ పోతున్నారు.

ఈరోజు ఉద్దానం బాధితుల‌ను క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌త చెంది చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలోనే ఈ స‌మ‌స్య‌ను తాను ప్ర‌స్తావించినా ప్ర‌భుత్వ ప‌రిష్క‌రించ‌లేద‌ని చెప్పిన ప‌వ‌న్ వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి - శ్రీ‌కాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని డిమాండ్ చేశారు.

ఈ స‌మ‌స్య‌ను డెడ్‌లైన్ లోపు ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప‌రిష్క‌ర‌ణ హామీ ఇవ్వ‌కుంటే తన యాత్రను అర్ధంత‌రంగా ఆపేసి, ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతానని అల్టిమేటం జారీ చేశారు. త‌ద‌నంత‌ర పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌న్నారు. అధికారం లేని వాళ్లు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తుంటే చేతిలో అధికారం ప‌ట్టుకుని చంద్ర‌బాబు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉన్నార‌ని, ఆయ‌న తాపీగా ఉంటే ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు ఎవ‌రు ప‌ట్టించుకంటార‌ని ప్ర‌శ్నించారు.

ఇంత పెద్ద‌ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి లేకపోవడం సిగ్గు చేటని, మంత్రిని నియమించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. హెల్త్ సెక్రటరీ అయినా ఈ విషయమై స్పందించాల‌ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాను తాను దాటేలోపే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


Tags:    

Similar News