'బద్రి' డైలాగును గుర్తు తెచ్చుకో.. పవన్‌!

Update: 2016-09-10 04:29 GMT
పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం ముగిసిపోయింది. ప్రత్యేక హోదా విషయంలో సాధించేవరకు పోరాడతాం అనే సంగతిని మాత్రం పవన్‌ ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తో పాటూ మరో బలమైన శక్తి కూడా హోదాకు అనుకూలంగా ఉండడం అనేది ప్రజల కోణంలోంచి ఆశావహ పరిణామం. అయితే ''ఇస్తారో ఇవ్వరో తేల్చండి.. మేం ఏం చేయాలో మేం తేల్చుకుంటాం'' అని పవన్‌ కల్యాణ్‌ శనివారం నాడు హెచ్చరించారు. సరిగ్గా ఈ అంశం దగ్గరే పవన్‌ కల్యాణ్‌ , తాను చేసిన బద్రి సినిమాలోని ఒక డైలాగును గుర్తు తెచ్చుకోవాలని జనం కోరుకుంటున్నారు.

'బద్రి'లో ప్రకాష్‌రాజ్‌ - పవన్‌కు ఫోన్‌ చేసి బెదిరిస్తాడు ''రేయ్‌ మళ్లీ ఇది గానీ రిపీట్‌ అయిందో.. నేనేం చేస్తానో నాకే తెలీదు'' అని అంటాడు. దానికి పవన్‌ కల్యాణ్‌ ''ముందు నువ్వేం చేయాలో డిసైడ్‌ చేసుకో.. ఎందుకంటే మళ్లీ ఇదే రిపీటవుద్ది'' అంటూ మెడ నిమురుకుంటూ చాలా ఆవేశంగా చెప్పేస్తాడు. ఈ డైలాగును ప్రత్యేకించి పవన్‌ ఫ్యాన్స్‌ అంత సులభంగా మరచిపోలేరు.

అయితే ఇప్పుడు హోదా పై పోరాటం విషయంలో పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న మాటలు - అచ్చంగా బద్రి చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ డైలాగుల మాదిరిగానే ఉన్నాయి. 'ముందు ఇస్తారో లేదో తేల్చండి.. మేం ఏం చేయాలో తేల్చుకుంటాం' అనడం పవన్‌ లోని అమాయకత్వాన్ని సూచిస్తోంది. ఇంతకంటె స్పష్టంగా కేంద్రం ఇంకేం తేల్చాలని ఆయన కోరుకుంటున్నారు. ''ముందు తాను ఏంచేయాలనుకుంటున్నాడో పవన్‌ తేల్చుకోవాలి. ఎందుకంటే... ఢిల్లీలో మళ్లీ అదే రిపీటవుద్ది' అందులో సందేహం లేదు. అందుకే పవన్‌ కల్యాణ్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే.. బద్రి చిత్రంలోని తన డైలాగునే ఓసారి గుర్తు తెచ్చుకోవాలని పలువురు అంటున్నారు.
Tags:    

Similar News