పీకే లాంగ్ మార్చ్..సన్నాహాలు అదిరిపోతున్నాయిగా!

Update: 2019-10-29 01:30 GMT
ఏపీలో ఇసుక కొరత - దాని పర్యవసానంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై నిరసన గళం విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వచ్చే నెల 3న సాగర నగరం విశాఖలో లాంగ్ మార్చ్ పేరిట భారీ నిరసన ప్రదర్శనను చేపట్టనున్నారు. మూడు రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్న పవన్... లాంగ్ మార్చ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ... సన్నాహాలు మొదలెట్టేశారు. సన్నాహాల వరకైతే ఓ రేంజిలో హైప్ పెంచేస్తున్న పవన్... లాంగ్ మార్చ్ ను ఏ మేర సక్సెస్ చేస్తారన్న విషయంపై ఇప్పుడు నిజంగానే ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి బొక్క బోర్లా పడిపోయిన పవన్... తనకు పరాజయం ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని తేల్చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో జగన్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దశల వారీ పోరాటాన్ని నాన్ స్టాప్ గా కొనసాగిస్తానని కూడా పవన్ చెప్పిన మాట గుర్తు ఉంది కదా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లాంగ్ మార్చ్ ను ప్రకటించారు.

వచ్చే నెల 30న జరగనున్న లాంగ్ మార్చ్ కు సంబంధించిన పోస్టర్లను పవన్ ఈ నెల 30న ఆవిష్కరిస్తారట. లాంగ్ మార్చ్ పై ఏదో ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదన్న విషయాన్ని చెప్పుకునేందుకు పవన్ ఏకంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీని భేటీ చేయించి మరీ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నా... పవన్ ఏ మేర ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారన్నదే అసలు సిసలు ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే... పార్టీలోని చాలా మంది కీలక నేతలు ఇప్పుటికే పీకేకు హ్యాండిచ్చేశారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, స్వయంగా పార్టీ అధినేత హోదాలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్... ఆ రెండింట చిత్తుగా ఓడటంతో పార్టీ శ్రేణులు కూడా పెద్దగా పార్టీపై దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు రాగానే... చాలా మంది కీలక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు, సామాన్య కార్యకర్తలు కూడా పార్టీకి దూరమైపోయారనే చెప్పాలి. ఈ క్రమంలో లాంగ్ మార్చ్ కు పార్టీ శ్రేణులు పెద్దగా తరలివచ్చే అవకాశాలే లేవన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న విశాఖలో పవన్ పార్టీ పెద్దగా పొడిచిందేమీ లేదు. నగర పరిధిలోని గాజువాక నుంచి పవన్ పోటీ చేసి ఓడిపోగా... విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా చిత్తుగా ఓడిపోయారు. మొత్తంగా నగరంలో జనసేనకు పెద్దగా అభిమాన గణం లేనట్లే లెక్క. అంతేకాకుండా ఎన్నికల దాకా ఊరించి ఊరించి ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ పార్టీలోకి వచ్చి చేరిన మాజీ జేడీ... ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో అసలు కనిపించడమే లేదు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించకున్నా... పార్టీ సమీక్షల్లో అయినా ఆయన కనిపిస్తున్నారా? అంటే.... అదీ లేదు. దీంతో విశాఖ లాంగ్ మార్చ్ కూ ఆయన హాజరవుతారన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఉన్న అరకొర నేతలతో పవన్ ఈ లాంగ్ మార్చ్ ను ఎలా సక్సెస్ చేస్తారన్న ప్రశ్నలు అప్పుడు మొదలైపోయాయి. పార్టీకి చెందిన కీలక నేతలు లేకుండా, కార్యకర్తలు లేకుండా... కేవలం సినీ స్టార్ గా తనకున్న అభిమానులతోనే పవన్ ఈ లాంగ్ మార్చ్ ను నిర్వహించక తప్పదన్న వాదనా లేకపోలేదు. దీంతో లాంగ్ మార్చ్ కు సన్నాహాలైతే ఓ రేంజిలో జరుగుతున్నాయి గానీ.. అసలు సినిమాలో పవన్ ఏ మేర రాణిస్తారన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు జరుగుతున్నాయి.



Tags:    

Similar News