పరిషత్ ఎన్నికల ఫలితాలపై పవన్ కీలక వ్యాఖ్యలు

Update: 2021-09-20 17:46 GMT
ఆసక్తిగా ఎదురుచూసిన పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల్ని బహిష్కరించినట్లుగా చెప్పటం.. పార్టీ లైన్ కు తగ్గట్లు కొందరు ఆగిపోతే.. మరికొందరు మాత్రం పోటీకి దిగారు. అయితే.. సానుకూల ఫలితాలు మాత్రం రాలేదు. అందరి అంచనాలకు తగ్గట్లే అధికార వైసీపీ పెద్ద ఎత్తున సీట్లను సొంతం చేసుకొని తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అద్భుతాలు అయితే క్రియేట్ చేయలేదు కానీ.. అంతో ఇంతో గౌరవ ప్రదమైన స్థానాల్ని సొంతం చేసుకుందున్న మాట వినిపిస్తోంది.

పరిషత్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ గెలుపు మాత్రం కొందరికే సొంతమైంది. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం చూస్తే.. 177 ఎంపీటీసీ.. రెండు జెడ్పీటీసీ స్థానాల్ని తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికి.. పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తాజాగా ప్రకటన విడుదల చేసిన పవన్.. ఈ ఎన్నికలు ఏ పరిస్థితుల్లో జరిగాయి? ఎలాంటి నేపథ్యంలో జరిగాయన్న సమాచారం తన వద్ద ఉందన్న ఆయన.. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందన్న ఆయన.. మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలన్నింటిని కలిపి రెండు.. మూడు రోజుల తర్వాత సంపూర్ణ విశ్లేషణతో తాను స్పందిస్తానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. పరిషత్ ఎన్నికల ఫలితాలు జనసేన ఆశించినంత రానప్పటికీ.. అవమానకరమైన రీతిలో మాత్రం లేకపోవటం కాస్తంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News