ఇక పవన్ సినిమాలు.. నాదెండ్ల రాజకీయాలా?

Update: 2020-12-21 13:30 GMT
పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. ఆయన నమ్మిన బంటు.. జనసేనలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ రాజకీయం చేస్తున్నారు. అమావాస్య-పౌర్ణమి చంద్రుడిలా పవన్ తీరిగ్గా ఖాళీ సమయంలో వచ్చి ఏపీలో ఓ టూర్ వేసి మళ్లీ వెళ్లిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కూడా నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై ప్రత్యర్థులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

ప్రతిపక్షంగా ఉంటే ఏదైనా సమస్య వస్తే చాలు దానిపై ప్రజల్లోకి వెళ్లి ఆందోళన చేయగలగాలి.. కానీ మన జనసేనాని పవన్ మాత్రం తనకు వీలున్నప్పుడే వచ్చి రాజకీయం చేస్తుండడం విశేషం. అమరావతి రైతుల తరుఫున పోరాడుతానన్న పవన్ చివరికి మొన్న వారి వార్షికోత్సవానికి రాకుండా హైదరాబాద్ లో ఓ సినీ నిర్మాత బర్త్ డేకు, సినిమా షూటింగ్ కు హాజరు కావడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఇదే కాదు.. తాజాగా దివీస్ అంశంలో పోరాటాన్ని జనసేన నెత్తిన ఎత్తుకుంది. అయితే ఈసారి పవన్ లేకుండా నాదెండ్ల మనోహర్ సీరియస్ ప్రకటన చేశారు. 10 రోజుల టైం ప్రభుత్వానికి ఇస్తున్నామని.. ఆలోగా సమస్య పరిష్కారం కాకపోతే పవన్ రంగంలోకి దిగుతారంటూ హెచ్చరించారు.

నిజానికి ఈ పని పవన్ ఏపీకి వచ్చి చేయవచ్చు. కానీ ఈరోజే హైదరాబాద్ లో కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. దీంతో ఇప్పట్లో పవన్ వచ్చే సూచనలు లేవు. అందుకే ఇలా పవన్ స్థానంలో నాదెండ్ల రాజకీయం మొదలుపెట్టారని.. షూటింగ్ గ్యాప్ లో పవన్ వచ్చి జాయిన్ అవుతారని భావిస్తున్నారు.

దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. పవన్ రాజకీయం పార్ట్ టైం అని.. షూటింగ్ లు, ఇతరత్రా కార్యక్రమాలు ఉంటే పవన్ రాడని అర్థమవుతోందని కామెంట్ చేస్తున్నారు.. నాదెండ్లనే ఇక జనసేనలో కాస్త యాక్టివ్ గా వ్యవహరిస్తారని అంటున్నారు.
Tags:    

Similar News