పవనిజం తెలిసింది.. సీఎం అభ్యర్ధిగా ఆయనేనంటూ....

Update: 2022-11-19 15:30 GMT
పవన్ కళ్యాణ్ ని నిన్నటిదాకా పెద్దగా పటించుకోని ఏపీ బీజేపీ ఇపుడు ఆయన పేరు రోజుకు పదిసార్లు తలుస్తోంది. అదే పనిగా తారక మంత్రంగా జపిస్తోంది.  దానికి కారణం ఏపీలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. థర్డ్ ఆల్టర్నేషన్ గా ఏపీలో జనసేన ఎమర్జ్ అయ్యేందుకు అవకాశాలు బాగా మెరుగుపడుతున్నాయి. దాంతో పవన్ వెంట పడుతోంది కమలం అంటున్నారు.

ఈ మధ్య విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ అర్ధ గంటకు పైగా ఏకాంత చర్చలు జరిపారు. దాంతో పవన్ కళ్యాణ్ స్థాయి తాహతూ ఏంటి అన్నది అందరికీ బాగా తెలిసి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో పవన్ బలమైన నాయకత్వంతో ముందుకు వస్తున్నారు అని అంటున్నారు.

ఈ నేపేధ్యంలో బీజేపీ సైతం పవన్ వెంటే తామూ తమతోనే పవన్ అంటూ కొత్తగా  రాగాలాపన మొదలెట్టారు. సోము వీర్రాజు అయితే పవన్ విషయంలో చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారు. పవన్ ఒక్క చాన్స్ అంటే తప్పేంటి, మేము పూర్తిగా మద్దతు ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ తమ మిత్రుడని, జనసేన తమ మిత్ర పక్షమని ఆయన ప్రకటిచారు.

జగన్ గతంలో ఒక్క చాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చారని, ఇపుడు చంద్రబాబు లాస్ట్ చాన్స్ అంటున్నారని, మరి పవన్ ఒక్క చాన్స్ అని ఏపీ ప్రజలను అడగకూడదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పవన్ ఒక్క చాన్స్ ని నిజం చేసేలా బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ గత నెలలో చేయక ముందు పరిస్థితి వేరు. చేశాక మొత్తం సీన్ మారిపోయింది. ఏపీ రాజకీయం అంతా ఆయన చుట్టూనే తిరుగుతోంది. చంద్రబాబు వచ్చి పవన్ని కలిశారు. మోడీ అయితే పవన్ తో భేటీ వేశారు. ఇదంతా జనాల్లో కూడా చర్చకు తావిస్తోంది. ఇక పవన్ ఎక్కడికి వెళ్ళినా వెల్లువలా జనాలు వస్తున్నారు. వారు సైతం పవన్ కి ఓటేస్తామని చెబుతున్నారు.

దాంతో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఏపీ రాజకీయాల్లో పవన్ మారుతున్నారని అంచనాకు వచ్చిన బీజేపీ టీడీపీ ఆయనను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ పవన్ టీడీపీతో వెళ్ళకుండా తమ వైపు ఉండేలా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఏపీ బీజేపీ కూడా దూకుడు చేస్తోంది. పవన్ పేరుతోనే రాజకీయాలు చేయాలని కూడా ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది.

అయితే పొత్తులు అన్నవి ఎన్నికల వేళ కానీ ప్రస్తుతానికి తాము జనంలో ఉండి పనిచేస్తామని నిన్నటికి నిన్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించిన నేపధ్యంలో బీజేపీ మరింతగా అలెర్ట్ అవుతోంది అని అంటున్నారు.

పవన్ని తమ వాడుగా జనంలో ముద్ర వేసుకునేందుకు కమలం పడుతున్న తాపత్రయం ఒక వైపు ఆసక్తికరంగా ఉండగా మరో వైపు టీడీపీ కూడా చివరి నిముషం వరకూ పవన్ని తమ వైపే ఉంచుకోవడానికి చూస్తుంది,  చేయాల్సినవి అన్నీ చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ మాత్రం ఏపీ పాలిటిక్స్ లో ఇపుడు అత్యంత కీలకం అవుతున్నారు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News